Jos Butler: ఎట్లయితేనేం... బట్లర్ ను ఫాంలోకి తెప్పించారు!
- జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ ఢీ
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు
- 59 బంతుల్లో 95 పరుగులు చేసిన బట్లర్
- ఇటీవల పేలవంగా ఆడుతున్న బట్లర్
- ఈ మ్యాచ్ తో టచ్ లోకి వచ్చిన వైనం
ఐపీఎల్ తాజా సీజన్ లో పేలవంగా ఆడుతూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో శివాలెత్తిపోయాడు. ఇటీవల ఫాంలో లేని బట్లర్ ఇవాళ ఫాం అందుకోవడమే కాదు, విధ్వంసక ఆటతీరుతో సన్ రైజర్స్ బౌలర్లను హడలెత్తించాడు.
ఏమంత పసలేని సన్ రైజర్స్ బౌలింగ్ బట్లర్ కు కలిసొచ్చింది. తొలి పవర్ ప్లేలో సన్ రైజర్స్ బౌలర్లు బట్లర్ నిలదొక్కుకునేందుకు అవకాశం ఇచ్చారు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత బట్లర్ బ్యాట్ ఝుళిపించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 59 బంతుల్లో 95 పరుగులు సాధించాడు. బట్లర్ స్కోరులో 10 ఫోర్లు, 4 భారీ సిక్సులు ఉన్నాయి. చివర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ కావడంతో సెంచరీ చేసే చాన్సు మిస్ చేసుకున్నాడు.
అంతకుముందు, ఓపెనర్ యశస్వి జైస్వాల్ 18 బంతుల్లోనే 35 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ కు సరైన ఆరంభాన్నిచ్చాడు. జైస్వాల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ బాదుడే బాదుడు అంటూ సన్ రైజర్స్ బౌలర్లను చితకబాదాడు. శాంసన్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 భారీ సిక్సులతో 66 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.
సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, మార్కో జాన్సెన్ 1 వికెట్ తీశారు. పాపం, ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.