Rajasthan: రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధర రాజే సాయం చేశారన్న గెహ్లాట్!
- 2020లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమిత్ షా కుట్ర పన్నారన్న గెహ్లాట్
- బీజేపీ నేత వసుంధర రాజే, మరో ఇద్దరు కలిసి ఆ కుట్రలను అడ్డుకున్నారన్న సీఎం
- గతంలో తాను బీజేపీ ప్రభుత్వం కూలిపోకుండా అడ్డుకున్నానన్న గెహ్లాట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రమంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి కుట్ర పన్నారని, అయితే ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే, మాజీ స్పీకర్ కైలాశ్ మేఘ్‌వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా కలిసి తమ ప్రభుత్వాన్ని కాపాడారని గెహ్లాట్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వారు అడ్డుకున్నారని అన్నారు.
అప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తాను మద్దతు ఇవ్వలేదని, అలాగే, 2020లో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వారు మద్దతు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిందన్న గెహ్లాట్ .. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోమారు అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.