Ukraine: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు!
- ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా
- మళ్లీ ప్రారంభం కావడంతో దేశంలో పెరుగుతున్న నిల్వలు
- రిటైల్ మార్కెట్లో 16 నుంచి 17 శాతం తగ్గనున్న ధరలు
గతేడాది సామాన్యులను బెంబేలెత్తించిన వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ధరలు 46 నుంచి 57 శాతం వరకు తగ్గాయి. ఈ తగ్గుదల రిటైల్ మార్కెట్లో మాత్రం 16-17 శాతంగానే ఉండనుంది.
దిగుమతి చేసుకునే ముడి సన్‌ఫ్లవర్ నూనె ధర.. సోయాబీన్, పామాయిల్ ధరల కంటే తక్కువగా ఉన్నట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏఐ) గణాంకాలు చెబుతున్నాయి. ముంబైలో ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు ప్రస్తుతం రూ. 81,300గా ఉండగా, టన్ను ముడి పామాయిల్ ధర రూ. 82 వేలుగా ఉంది. సోయాబీన్ ఆయిల్ ధర రూ. 85,400గా ఉంది.
ఏడాది క్రితం మాత్రం ముడి పామాయిల్, సోయాబీన్ ధరల కంటే సన్‌ఫ్లవర్ నూనె ధరే ఎక్కువగా అంటే రూ.1.7 లక్షలు ఉండేది. అయితే ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్ నుంచి ముడి నూనెల సరఫరా ప్రారంభమైందని, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అధికంగా ఉందని ఎస్ఈఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు. దిగుమతులు పెరగడంతో నిల్వలు కూడా అదే స్థాయిలో పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. అయితే, రిటైల్ మార్కెట్లో తగ్గిన ధరలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.