Andhra Pradesh: చంద్రబాబు అంటే గౌరవం.. ఆయనకూ నేనంటే అభిమానం: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- 2019లో చంద్రబాబు, జగన్ ఇద్దరూ పార్టీల్లోకి ఆహ్వానించారన్న విష్ణుకుమార్ రాజు
- వైసీపీలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామన్నారన్న బీజేపీ నేత
- బీజేపీ తనకు టికెట్ ఇచ్చి, ఫ్లోర్ లీడర్‌ను చేసిందని వ్యాఖ్య
- భవిష్యత్ నిర్ణయానికి సమయం ఉందన్న విష్ణుకుమార్ రాజు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అంటే తనకు చాలా గౌరవమని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కూడా తనంటే ఎంతో అభిమామనమని అన్నారు.
2019లో చంద్రబాబు తనను పార్టీలోకి ఆహ్వానించారని, అయితే రాబోనని తేల్చి చెప్పానని అన్నారు. అలాగే, జగన్ కూడా వాళ్ల మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డిని, ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఓ వ్యక్తిని పంపి పార్టీలోకి ఆహ్వానించారని, తనకు మంత్రి పదవి కూడా ఇస్తామన్నారని అన్నారు. అయితే, రెండు పార్టీల నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించినట్టు చెప్పారు.
బీజేపీ తనకు టికెట్ ఇచ్చిందని, ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించిందని అన్నారు. అయితే, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించుకునేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితిని దేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడలేదని విష్ణుకుమార్ అన్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక తప్పదని జనం అనుకుంటున్నారని అన్నారు.
ఆంధ్రాని జగన్ సర్వనాశనం చేసేశారు
హైదరాబాద్ వస్తుంటే బాధ, సంతోషం రెండూ కలుగుతున్నాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని సంతోషంగా ఉన్నా.. ఏపీతో పోల్చుకుంటే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నందుకు అసూయగా ఉందన్నారు. ఏపీని జగన్ సర్వనాశనం చేసేశారని, ఈ విషయాన్ని చెప్పడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదని అన్నారు.