Guntur: శభాష్ అనఘాలక్ష్మి.. పదో తరగతిలో 566 మార్కులు సాధించిన ఆరో తరగతి అమ్మాయి!
- గుంటూరు బ్రాడీపేటలోని ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న అనఘాలక్ష్మి
- అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లో చిన్నప్పటి నుంచే ప్రతిభ
- గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి
- ఉన్నతాధికారుల అనుమతితో ‘పది’ పరీక్షలు రాసిన బాలిక
ఆరో తరగతి బాలిక పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 566 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. గుంటూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మి (11) బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి విష్ణువర్ధన్‌రెడ్డి మంగళగిరి స్టేట్ బ్యాంక్ ఉద్యోగి కాగా, తల్లి సత్యదేవి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తిచేశారు.
తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లో ప్రతిభ కనబరుస్తున్న అనఘాలక్ష్మి.. గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరుకుంది. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ప్రతిభకు ముగ్దుడైన మంత్రి ఆదిమూలపు సురేష్ ఆమెతో ‘పది’ పరీక్షలు రాయించమని సూచించారు.
అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో ఇటీవల అందరితోపాటు అనఘాలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసింది. శనివారం విడుదలైన ఫలితాల్లో బాలిక 566 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. కాగా, కాకినాడకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ కూడా పదో తరగతి పరీక్షల్లో 488 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంది.