Artificial Intelligence: ఏఐతో వైద్య రంగంలో అద్భుతాలు.. వేగంగా వ్యాధి నిర్ధారణ, చికిత్సలు

The Role of Artificial Intelligence in Healthcare Opportunities

  • క్లిష్టమైన డేటాను ఏఐ సులభంగా విశ్లేషించగలదు
  • మానవ పరమైన తప్పిదాలకు చెక్
  • వైద్యుల పని సులభతరం
  • దీంతో రోగులకు మెరుగైన వైద్య సూచనలు
  • రోగి ఇంటి నుంచే చికిత్సలకు వెసులుబాటు
  • వేగంగా నూతన ఔషధాల పరిశోధన

మనిషి తన మేథస్సుతో (ఇంటెలిజెన్స్) నాటి నుంచి నేటి వరకు ఎంతో పురోగతి సాధించగా, ఇప్పుడు కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ) ప్రపంచాన్ని మరింత ఆధునికత వైపు తీసుకెళ్లనుంది. ఎన్నో రంగాల్లో కృత్రిమ మేథ అనివార్యం కాగా, ముఖ్యంగా వైద్యం, ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఇది కొత్త పుంతలు తొక్కించనుంది. రోగుల సంక్షేమం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఇలా మొత్తంగా ఆరోగ్య నిర్వహణను వేగవంతం, సమర్థవంతంగా మార్చడమే కాదు, సులభతరం చేయనుంది. ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల్లో ఏఐ ఏ విధమైన మార్పులు తీసుకురానుందనే విషయాన్ని గమనించినట్టయితే..

వ్యాధి నిర్ధారణ పరీక్షలు/కచ్చితమైన చికిత్సలు
 ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక రోజులో కొన్ని నమూనాలనే పరీక్షించగలడు. కానీ, ఏఐ ఆధారిత మెషిన్లు తక్కువ సమయంలోనే వేలాది పరీక్షలు నిర్వహించగలవు. దీనివల్ల ఫలితాల్లోనూ కచ్చితత్వం పెరుగుతుంది. ఇదంతా ప్రోగ్రామింగ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒక వైద్యుడు ఒక రోగి కోసం మహా అయితే కొన్ని నిమిషాలే కేటాయించగలడు. రోజువారీగా ఉండే రోగుల రద్దీపైనే ఎంత సమయం వెచ్చించడం అన్నది ఆధారపడి ఉంటుంది.

క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి వైద్యులు ఎన్నో పరీక్షలు రాస్తుంటారు. అవి చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి ఇస్తే వాటిని వివరంగా చూసే తీరిక వారికి ఉండదు. వేగంగా పేజీలు తిప్పేసి మందులు రాసి పంపిస్తుంటారు. దీనివల్ల అన్ని సందర్భాల్లోనూ సమస్యలు వెంటనే నయం అవుతాయన్న గ్యారంటీ ఉండదు. కానీ ఏఐ దీన్ని మరింత సమర్థవంతంగా మార్చగలదు. ఒక రోగికి సంబంధించి ఇమేజ్ లు, రికార్డులు అన్నింటినీ ఏఐ పరిశీలించి ఒక చక్కని నివేదిక ఇవ్వగలదు. ఎక్స్ రే, ఎంఆర్ఐ, స్కాన్, సీటీ స్కాన్ ఇమేజ్ లను మనుషులతో పోలిస్తే ఏఐ మరింత కచ్చితంగా విశ్లేషించగలదు. దీనివల్ల మానవ తప్పిదాలను నివారించొచ్చు. ఇమేజ్ ల ఆధారంగా రోగికి ఉన్న సమస్యపై ఏఐ ఇచ్చిన నివేదికను రేడియాలజిస్టులు, ఇతర స్పెషలిస్ట్ వైద్యులు సులభంగా అర్థం చేసుకోగలరు. అవసరమైతే వారు కూడా మరోసారి వేగంగా ఇమేజ్ ను పరిశీలించగలరు. సమయం ఆదాకు తోడు కచ్చితత్వం ఇందులో సాధ్యపడుతుంది. 

ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందో చూస్తున్నారుగా.. ఏది అడిగినా దాదాపు చక్కని సమాచారాన్ని వేగంగా మన ముందు ఉంచుతోంది. ఆ సమాచారం అంతా కూడా నెట్ పేజీల నుంచే తెస్తోంది. అలాగే, వ్యాధి నిర్ధారణలోనూ ఒక రోగికి సంబంధించిన రికార్డులను ఏఐ టెక్నాలజీ అద్భుతంగా విశ్లేషించి, వేగంగా నివేదిక ఇవ్వగలదు. ఈ నివేదిక ఆధారంగా రోగికి ఎలాంటి చికిత్స అవసరమో డాక్టర్ సులభంగా నిర్ణయించి సూచించగలరు. అప్పుడు డాక్టర్లు, రోగుల సమయం కూడా ఆదా అవుతుంది. వైద్యులపై పని భారం తగ్గుతుంది. దాంతో వారు రోగుల సంరక్షణపై మరింత సమయం వెచ్చించగలరు. మెరుగైన వైద్యానికి వీలు పడుతుంది.

రోగికి సరైన ఔషధాలు సూచించడం చికిత్సలో అత్యంత కీలకమైన అంశం అవుతుంది. ఏఐ దీన్ని మరింత మెరుగుపరుస్తుంది. రోగి జన్యువులు, జీవనశైలి విధానం, వ్యాధి నిర్ధారణ పరీక్షల సమాచారం వీటన్నింటినీ ఏఐ విశ్లేషిస్తుంది. దీంతో విడిగా ఒక్కో రోగికి అనుకూలమైన, సమర్థవంతమైన చికిత్స అందించడం సాధ్యపడుతుంది. రోగి డేటా ఆధారంగా భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను కూడా ఏఐ టెక్నాలజీ ముందే గుర్తించగలదు. దీంతో వాటి నివారణపై దృష్టి పెట్టడం వీలవుతుంది.

ఔషధ పరిశోధన వేగవంతం
 ఒక కొత్త ఔషధాన్ని పరిశోధించి మార్కెట్లోకి తీసుకురావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. ఏఐ దీన్ని మరింత వేగవంతం చేయగలదు. క్లిష్టమైన బయోలాజికల్ డేటాను ఏఐ సులభంగా విశ్లేషించగలదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక మనిషికి ఉండే పరిమితులు ఉండవు. తప్పులను దాదాపు నివారించొచ్చు. ప్రభావవంతమైన ఔషధాలను గుర్తించగలదు. వాటి సామర్థ్యాన్ని తేల్చగలదు. దీనివల్ల తక్కువ సమయంలోనే సమర్థవంతమైన నూతన ఔషధాలను తీసుకురావడం వీలు పడుతుంది. దీనివల్ల ఎంతో ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యంగా క్లినికల్ ట్రయల్స్ లో డేటా పరంగా ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. ఔషధ పరీక్షల్లో డేటాకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాదు ఒక ఔషధానికి సంబంధించి వేలు, లక్షలాది పేజీల డేటా ఉంటుంది. దీన్ని కచ్చితత్వంతో విశ్లేషించడం మనుషుల కంటే ఈ టెక్నాలజీయే సమర్థవంతంగా, వేగంగా చేయగలదు. 

టెలీ హెల్త్
 ఏఐ వల్ల మరో సౌలభ్యం ప్రతిదానికీ రోగి వైద్యుడి వరకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. రోగి తాను ఉన్న చోట నుంచే ఈ టెక్నాలజీ సాయంతో వైద్యుడి సలహా, సూచనలు పొందొచ్చు. టెలీ హెల్త్ రూపంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సేవలను ఏఐ మరింత మెరుగుపరుస్తుంది. వేగవంతం చేస్తుంది. రోగి ఎక్కడున్నా, అతడికి సంబంధించిన తాజా సమాచారం ఏఐ ఆధారిత హెల్త్ గ్యాడ్జెట్ల (పరికరాలు) సాయంతో వైద్యుడికి చేరవేయగలదు. బ్లడ్ షుగర్, బీపీ, ఆక్సిజన్, హృదయ స్పందనలు తదితర ప్యారా మీటర్లు ఎలా ఉన్నదీ వైద్యులకు ఏఐ ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తుంది. దాంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యుడు సూచిస్తాడు. ముఖ్యంగా వైద్య సేవలు అంతగా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఇది ఎక్కువ ఉపయోగకరం. మెరుగైన వైద్య సేవలను వేగంగా అందించడంలో సాయపడుతుంది. కొన్ని సర్జరీల తర్వాత రోగులు కోలుకోవడాన్ని ఏఐ టెక్నాలజీతో పర్యవేక్షించొచ్చు. గాయపడిన వారు, వైకల్యంతో బాధపడే వారు చికిత్సతో పొందుతున్న ఫలితాలను వైద్యులు రిమోట్ గా విశ్లేషించడం సాధ్యపడుతుంది. 

నిర్వహణ సులభతరం
వైద్యుల అపాయింట్ మెంట్, పేషెంట్ రికార్డుల నిర్వహణ, బీమా క్లెయిమ్ ల వ్యవహారాలు చూడడాన్ని ఏఐ చేయగలదు. దీనివల్ల విలువైన మానవ వనరులను ఆదా చేసుకోవచ్చు. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది.

వైద్య విద్య కొత్త పుంతలు
 వైద్య విద్యలో ప్రాక్టికల్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఏఐ దీన్ని నవీకరించగలదు. మెడికల్ కోర్సులు చేసే అభ్యర్థులకు నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇందుకు సాయపడతాయి. 

ఇవి కాకుండా వైద్య రంగంలో సరఫరా వ్యవస్థ ఎంతో కీలకమైనది. కరోనా వచ్చినప్పుడు సప్లయ్ చైన్ లో సమస్యలను చూశాం. కానీ, ఏఐ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే సప్లయ్ చైన్ మరింత బలపడుతుంది. ఔషధాలు, ఉపకరణాలు తదితర ఇన్వెంటరీ నిర్వహణ, అసలు డిమాండ్ ఎంత మేర ఉంది, దానికి తగ్గట్టు వేగంగా సరఫరా ఎలా చేయాలి? అనేది ఏఐతో సులభతరం అవుతుంది. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. వైద్య రంగంలో వస్తున్న మార్పులు, కొత్త వ్యాధులు ప్రబలడం తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ, విశ్లేషిస్తూ ముందస్తు నివారణ చర్యలను సైతం ఏఐ సూచించగలదు.

  • Loading...

More Telugu News