karumuri Nageswara Rao: నేను ఆ రైతును తిట్టలేదు... ఎర్రి పప్ప అన్నానంతే!: మంత్రి కారుమూరి
- నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి పర్యటన
- రైతులతో సమావేశం
- ధాన్యం ఎలా ఉన్నా కొంటామని హామీ
- ఓ వ్యక్తి బాగా తాగి వచ్చి అగ్రిగోల్డ్ గురించి అడిగాడన్న మంత్రి
ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండం వేల్పూరులో పర్యటించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఓ రైతుపై మండిపడ్డారని, తిట్టారని కథనాలు వచ్చాయి. దీనిపై మంత్రి కారుమూరి వివరణ ఇచ్చారు. తాను ఆ రైతును దూషించలేదని స్పష్టం చేశారు.
నిన్న రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చానని తెలిపారు. మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని వారు తనతో చెప్పుకున్నారని, ఏ మిల్లరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని రైతులకు చెప్పానని వివరించారు. తన ఫోన్ నెంబరు కూడా ఇస్తున్నానని, ఏ మిల్లు వాళ్లయినా రైతుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా ఆ మిల్లును బ్లాక్ చేస్తామని రైతులకు చెప్పానని తెలిపారు.
"నేను ఈ విధంగా రైతులతో మాట్లాడుతుంటే ఓ వ్యక్తి బాగా తాగి వచ్చాడు. నా పంట మొలకొచ్చింది, నా పంట మొలిచేసిందండీ అని ఏదేదో చెబుతున్నాడు. ధాన్యం ఎలా ఉన్నా కొంటాం అని అతడకి చెప్పాను. అప్పుడు అతను అగ్రిగోల్డ్ ఏంటండీ అన్నాడు. దాంతో అతడిని ఉద్దేశించి ఎర్రి పప్ప అని అన్నాను. ఎర్రి పప్ప అంటే నా బుజ్జినాన్న అని అర్థం" అని మంత్రి కారుమూరి వెల్లడించారు.