Narendra Modi: గజరాజు 'బలరామ' మృతి పట్ల ప్రధాని మోదీ విచారం
- మైసూరులో దసరా ఉత్సవాల్లో కనిపించే ఏనుగు బలరామ
- గత కొన్నిరోజులుగా అనారోగ్యం
- భీమనకట్టె క్యాంపులో కన్నుమూత
- నేడు అంత్యక్రియలు
కర్ణాటకలో చారిత్రక నగరం మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో తెలిసిందే. అయితే ఈ దసరా వేడుకల్లో క్రమం తప్పకుండా పాల్గొనే ఏనుగు బలరామ ఇటీవల మృతి చెందింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
మైసూరు దసరా ఉత్సవాల్లో ఎన్నో ఏళ్లగా గజరాజు బలరామ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మోసే ఏనుగుగా బలరామకు ప్రజల్లో గుర్తింపు ఉందని వెల్లడించారు. ఎంతోమంది ఈ ఏనుగును అభిమానించేవారని తెలిపారు. ఇప్పుడా ఏనుగు కన్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కన్నడ భాషలో ట్వీట్ చేశారు.
గజరాజు బలరామ వయసు 65 ఏళ్లు. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆదివారం నాడు నాగరహోళె పులుల అభయారణ్యం వద్ద భీమనకట్టె క్యాంపులో తుదిశ్వాస విడిచింది. ఇవాళ సకల లాంచనాలతో ఆ వృద్ధ ఏనుగు అంత్యక్రియలు నిర్వహించారు.
బలరామ కొన్నిరోజులుగా గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని, దాంతో ఆహారం, నీరు సరిగా తీసుకోలేపోయిందని అధికారులు తెలిపారు