Revanth Reddy: ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.4 వేల భృతి అందిస్తాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy speech in Congress meeting in Saroor Nagar

  • హైదరాబాదులో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ
  • హాజరైన ప్రియాంక గాంధీ
  • యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక
  • తెలంగాణ కోసం 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదన్న రేవంత్

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభ ఏర్పాటు చేశారు. ఈ నిరుద్యోగుల సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర అగ్రనేతలు కూడా ఈ సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించేందుకు వచ్చిన ప్రియాంక గాంధీకి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ ఇవాళ నిరుద్యోగులకు, యువతకు అండగా నిలిచేందుకు వచ్చారని అన్నారు. 

సోనియా, ప్రియాంక అండదండలతో, మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ముందుకు పోతున్నామని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్ ప్రసంగం హైలైట్స్...

  • తెలంగాణ కోసం 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదు. విభజన సమయంలో 5.3 లక్షల ఉద్యోగాలు కేటాయించారు. తొలి ఏడాది 1.07 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని కేసీఆర్ మాటిచ్చారు. కానీ నమ్మించి మోసం చేశారు.
  • ప్రస్తుతం తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. తొమ్మిదేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేయడంలేదు.
  • నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. 
  • అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తొలి డిక్లరేషన్ చేస్తున్నాం. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలు కూడా తెలుసుకునేలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ముందుకు తీసుకెళుతుంది.
  • అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తాం.
  • ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ తీసుకువస్తున్నాం.
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనే. మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం.
  • జూన్ 2 నాటికి ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరించి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం. నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబరు 17 నాటికి నియామక పత్రాలు లబ్దిదారులకు అందజేస్తాం.
  • నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల భృతి అందజేస్తాం. 
  • కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చవటలను, దద్దమ్మలను సభ్యులుగా చేశాడు. టీఎస్ పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. మేం అధికారంలోకి వస్తే టీఎస్ పీఎస్సీని బలోపేతం చేస్తాం. 
  • యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా నియామకాలు చేపడతాం. కేంద్రీయ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానం తీసుకువస్తాం.
  • ఏడు జోన్లలో ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చర్యలు తీసుకుంటాం. 
  • నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తాం.
  • విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడమే కాకుండా, పాత బకాయిలన్నీ చెల్లిస్తాం. 
  • గల్ఫ్ వెళ్లిన కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం. మోసం చేసిన ఏజెంట్లను కఠినంగా శిక్షిస్తాం.
  • ఆర్టీసీ కార్మికులు, పోలీసుల పిల్లల కోసం రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం. ఒకటి వరంగల్ లో, రెండోది హైదరాబాదులో ఏర్పాటు చేసి వారి పిల్లలకు 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
  • అన్నింటి కంటే ముఖ్యమైనది, ప్రియాంక గాంధీ కోరుకుంటున్న యువ మహిళా సాధికారత.
  • యువతులు ఎక్కడికైనా వెళ్లాలంటే తండ్రి మీదనో, అన్న మీదనో, తమ్ముడి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే, రాష్ట్రంలో చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీని ఉచితంగా అందిస్తాం. తద్వారా ఎవరిపైనా ఆధారపడకుండా విద్యార్థునులు స్వతంత్రంగా కాలేజీలకు వెళ్లి చదువుకోగలరని ఆశిస్తున్నాం.
  • స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుతో గ్రామీణ యువతకు చేయూతగా అందిస్తాం.
  • యువత భవిష్యత్తే కాంగ్రెస్ నినాదం... అమరుల ఆశయ సాధనే విధానం. 

  • Loading...

More Telugu News