KTR: సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండమవుతుంది: బీజేపీకి కేటీఆర్ వార్నింగ్

KTR asks people to vote kcr third time

  • సింగరేణి అంటే ఒక కంపెనీ కాదని, భాగ్యరేఖ అని అన్న కేటీఆర్
  • తెలంగాణ కొంగు బంగారం సింగ‌రేణి అని అభివర్ణన  
  • మోదీ గాలిమోటారుపై వచ్చి గాలిమాటలు చెప్పి వెళ్లాడన్న మంత్రి

కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ కొంగు బంగారం సింగ‌రేణి అని, సింగ‌రేణి అంటే ఒక కంపెనీ కాదని, తెలంగాణ భాగ్య‌రేఖ‌ అన్నారు. అలాంటి సింగ‌రేణిని అమ్మే ప్ర‌య‌త్నం చేస్తే రామ‌గుండం అగ్నిగుండమవుతుందని కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చ‌రించారు. రామ‌గుండం కార్పొరేష‌న్ ప‌రిధిలో రూ.300 కోట్ల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేసుకున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయన మాట్లాడారు.

సింగ‌రేణి ప‌ట్ల కేంద్రానికి నిజంగానే చిత్త‌శుద్ధి ఉంటే ప్రభుత్వ కంపెనీకి నామినేష‌న్ మీద ఇవ్వ‌మ‌ని అడిగామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి స్పందన లేదన్నారు. గాలి మోటారు మీద వచ్చి సింగ‌రేణిని అమ్మ‌బోమ‌ని మోదీ గాలి మాట‌లు చెప్పాడని, మరుసటి రోజు నాలుగు బొగ్గు గ‌నుల‌ను వేలానికి పెట్టారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మితే అక్కడ కొందరు మాట్లాడవచ్చు... మరికొందరు మాట్లాడకపోవచ్చునని, కానీ తెలంగాణలో కేసీఆర్ తో పెట్టుకుంటే మాత్రం విడిచిపెట్టేది లేదన్నారు. ఎక్కడిదాకైనా వెళ్తామన్నారు.

సింగ‌రేణి మ‌నుగడ సాధించాలంటే మ‌న గోడు వినేటోడు ఒక‌డు ఢిల్లీలో ఉండాలని, ఈ బొగ్గు గ‌నుల‌ను కాపాడుకోవాలంటే ఒక్క బీజేపీ అభ్య‌ర్థికి కూడా ఓటు వేయవద్దన్నారు. డిపాజిట్లు గ‌ల్లంతు చేసి గుండు కొట్టించి అవ‌త‌లికి పంపించాలని రామ‌గుండం ప్ర‌జ‌లను, సింగ‌రేణి కార్మికుల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు.

ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకు వచ్చిందని, ఆమె కూడా వచ్చి కేసీఆర్ ది కుటుంబ పాలన అంటారని విమర్శించారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ మీ బిడ్డ అని, పార్టీ పేరు మారింది కానీ డీఎన్ఏ మారలేదన్నారు. ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు.


  • Loading...

More Telugu News