Vijayasai Reddy: విభజన సమస్యలు ఉన్నప్పటికీ ఏపీ దూసుకుపోతోంది: విజయసాయిరెడ్డి
- జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,50,007 అని ఆర్బీఐ తెలిపిందన్న విజయసాయి
- ఏపీ తలసరి ఆదాయం రూ. 2,07,771 అని వెల్లడి
- టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు విదేశాల్లో స్థిరపడటం వల్ల తలసరి ఆదాయం పెరుగుతోందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించడంలో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడుతోందని చెప్పారు. విభజన సమస్యలు వేధిస్తున్నప్పటికీ ఏపీ ఈ ఘనతను సాధించిందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం ఈ విషయం స్పష్టమవుతోందని చెప్పారు.
జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,50,007గా ఉండగా... ఏపీ తలసరి ఆదాయం రూ. 2,07,771గా ఉందని విజయసాయి తెలిపారు. ఫార్మా, ఐటీ హబ్ అయిన హైదరాబాద్ తలసరి ఆదాయం రూ. 2,65,623 కాగా... పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఏపీ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు విదేశాల్లో స్థిరపడటం వల్ల ఏపీ తలసరి ఆదాయం పెరుగుతూ పోతోందని తెలిపారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆర్థికాభివృద్ధి విషయంలో కర్ణాటక, హైదరాబాద్ మధ్య పోటీ ఉందని... ఇదే సమయంలో ఏపీ సహా మరో మూడు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆర్థిక వృద్ధి రేటులో ముందడుగు వేస్తున్నాయని చెప్పారు.