Telangana: తెలంగాణ ఇంటర్ లోనూ బాలికలదే పైచేయి

telangana inter results declared

  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితారెడ్డి
  • గతేడాదికన్నా తగ్గిన ఉత్తీర్ణత
  • ఫస్టియర్ లో 63.85 శాతం పాస్
  • సెకండియర్ లో 67.26 శాతం ఉత్తీర్ణత
  • గురుకుల కాలేజీల్లో 92 శాతం మంది విద్యార్థుల పాస్

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులు రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ లో మొత్తంగా 63.85 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, సెకండియర్ లో 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే, గతేడాదికన్నా ఉత్తీర్ణత తగ్గిందని అధికారులు తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్ లో నిలవగా.. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు.. 5 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు, 4.5 లక్షల మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల్లో గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో 62 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో 54 శాతం ఉత్తీర్ణత వచ్చిందని చెప్పారు. వచ్చే ఏడాది గురుకుల కాలేజీలతో పోటీపడి ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు మంత్రి సూచించారు. ఒకటో రెండో సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వారిని దగ్గరకు తీసుకుని కౌన్సెలింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 4 నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఫెయిలైన సబ్జెక్టులకు సంబంధించి మళ్లీ పరీక్ష రాసి పాసయ్యేందుకు అవకాశం ఉందని, మీ స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్లేందుకు మరో అవకాశం ఉందని విద్యార్థులకు మంత్రి సూచించారు.

  • Loading...

More Telugu News