wedding photographer: పెళ్లి పెటాకులైందని వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ను రిఫండ్ కోరిన మహిళ
- పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్
- సౌతాఫ్రికాలోని డర్బన్ సిటీలో వింత ఘటన
- ఫొటోగ్రఫీ సర్వీసుకు రిఫండ్ కుదరదన్న కెమెరామెన్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్వీట్
నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఓ మహిళ భర్తతో సరిపడక విడాకులు తీసుకుంది.. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు అన్నట్లు వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు అక్కర్లేదని ఆమె భావించింది. ఆ ఫొటోలు తీసిన కెమెరామెన్ కు ఇచ్చిన డబ్బులను తిరిగి రాబట్టుకోవాలని అనుకుంది. తన పెళ్లి పెటాకులు అయింది కాబట్టి అప్పట్లో తాము చెల్లించిన సొమ్ము తిరిగివ్వాలంటూ సదరు కెమెరామెన్ కు వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది. తొలుత ఇదేదో ప్రాంక్ అనుకున్న ఆ ఫొటోగ్రాఫర్.. సరదాగా బదులిచ్చాడు. అయితే, తాను కోర్టుకు వెళతానంటూ మహిళ బెదిరించడంతో సీరియస్ గానే స్పందించాడు. మీ లాయర్ తో మాట్లాడించండని చెప్పాడు. ఈ వింత ఘటన సౌతాఫ్రికాలోని డర్బన్ లో చోటుచేసుకుంది.
డర్బన్ కు చెందిన ఓ మహిళ 2019 లో వివాహం చేసుకుంది. ఆ వేడుకకు సంబంధించిన జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి కాబోయే భర్తతో కలిసి ఓ కెమెరామెన్ ను నియమించుకుంది. కెమెరామెన్ అడిగినంత డబ్బు ఇచ్చింది. అయితే, తాజాగా ఆ జంట విడిపోయింది. తన భర్తతో జీవితం అనుకున్నట్లుగా సాగలేదని, తాము విడిపోయామని కెమెరామెన్ కు మెసేజ్ చేసింది. దీనిపై ఆ కెమెరామెన్ కూడా సంతాపం వ్యక్తం చేశాడు. అయితే, పెళ్లి ఫొటోలు తీయడానికి ఇచ్చిన సొమ్ము తిరిగివ్వాలన్న ఆమె కోరికను మాత్రం మన్నించలేనని తేల్చిచెప్పాడు. ఫొటోగ్రఫీ సేవలకు ఎలాంటి రిఫండ్ ఉండదని స్పష్టం చేశాడు.
అయినా ఆమె వినిపించుకోలేదు, తాము చెల్లించిన ఫీజులో కనీసం 70 శాతం అయినా తిరిగి పొందే హక్కు ఉందని వాదించింది. దీనిపై అవసరమైతే కోర్టుకు వెళతానంటూ బెదిరించింది. సదరు మహిళ వాదనతో విసిగిపోయిన కెమెరామెన్.. ఆమె లాయర్ తోనే మాట్లాడించాలని కోరాడు. వాట్సాప్ లో జరిగిన ఈ చాటింగ్ ను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ మహిళ మాజీ భర్త తనను సంప్రదించాడని, తన మాజీ భార్య ప్రవర్తనకు సారీ చెప్పాడని కెమెరామెన్ ఈ పోస్టులో వివరించాడు.