Surya Kumar Yadav: సలాం సూర్యా భాయ్... ఒక్క దెబ్బతో మూడో స్థానానికి ముంబయి
- ఆర్సీబీని 6 వికెట్ల తేడాతో ఓడించిన ముంబయి ఇండియన్స్
- 200 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో ఛేదించిన వైనం
- 35 బంతుల్లో 83 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్
- 7 ఫోర్లు, 6 సిక్సులతో బీభత్సం
- అర్ధసెంచరీతో సత్తా చాటిన నేహాల్ వధేరా
ఐపీఎల్ తాజా సీజన్ లో మరో విధ్వంసక ఇన్నింగ్స్ నమోదైంది. మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చిచ్చరపిడుగులా చెలరేగిన వేళ ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముంబయి జట్టు 200 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించింది.
ముంబయి ఛేజింగ్ లో సూర్య ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. భారీ షాట్లు కొట్టడం ఇంత తేలికా అన్నట్టుగా అతడి బ్యాటింగ్ సాగింది. ఇటీవల వరుసగా డకౌట్లు అయింది ఇతడేనా అనిపించేలా సూర్య వీరవిహారం కనువిందు చేసింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబయికి ఆరంభం అదిరింది. ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 42 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఆ తర్వాత, ఫాంలో లేని కెప్టెన్ రోహిత్ శర్మ (7) మరోసారి స్వల్ప స్కోరుకు వెనుదిరిగాడు.
అయితే, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా జోడీ వాంఖెడే స్టేడియంలో పరుగుల వెల్లువ సృష్టించారు. వీరి విజృంభణకు ఆర్సీబీ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మైదానంలో వీరు షాట్ కొట్టని ప్రదేశం అంటూ లేదు. నేహాల్ వధేరా కొట్టిన ఓ సిక్స్ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన టాటా టియాగో ఈవీ కారుకు తగిలి సొట్టపడింది.
సూర్య 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్ లతో 83 పరుగులు చేసి చివర్లో అవుటయ్యాడు. అయితే వధేరా ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించి ముంబయి ఇండియన్స్ కు గెలుపును అందించాడు. వధేరా 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టిమ్ డేవిడ్ ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. బెంగళూరు బౌలర్లలో హసరంగ 2, విజయ్ కుమార్ వైశాక్ 2 వికెట్లు తీశారు.
ఈ విజయంతో ముంబయి జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నెంబర్ వన్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ (11 మ్యాచ్ ల్లో 8 విజయాలు), రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (11 మ్యాచ్ ల్లో 6 విజయాలు) ఉన్నాయి.