Telangana: తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల.. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్

telangana tenth results declared by minister sabita indra reddy

  • 59 శాతంతో వికారాబాద్ జిల్లా లాస్ట్
  • 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత
  • బాలికలు 89 శాతం, బాలురు 85 శాతం పాస్
  • 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు 
  • వచ్చే నెల 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు 

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 4,84,370 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం పాస్ అయ్యారు.

రాష్ట్రంలోని 2,793 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. అందులో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ లో నిలిచింది. పది ఫలితాల్లో 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. రాష్ట్రంలోని 25 పాఠశాలలలో కనీసం ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 9 మంది విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల బండిల్ కనిపించకుండా పోయింది. దీంతో అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుని వారిని పాస్ చేసినట్టు సమాచారం.

రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్ అయిన విద్యార్థులకు, వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల టీచర్లకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఫెయిలైన విద్యార్థులు అధైర్యపడవద్దని, వచ్చే నెల 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను  bse.telangana.gov.in,  bseresults.telangana.gov.in వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News