Telangana: తెలంగాణలో నేటి నుంచి అసలైన వేసవి.. జాగ్రత్తగా ఉండాల్సిందే
- ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న వాతావరణ కేంద్రం
- 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వెల్లడి
- పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక
ఆకాల వర్షాల కారణంగా తెలంగాణలో గత నెల రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంటోంది. అసలు ఇది ఎండా కాలమేనా అనిపించేలా వర్షం కురుస్తోంది. అయితే,ఈ రోజు నుంచి అసలైన వేసవి కనిపించనుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.
ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంగళవారం 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండ ఉంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరగనున్నాయి. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరికానున్నారు. అలాగే, ఈ రోజు నుంచి 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.