CSK: మళ్లీ అదే తీరు.. చెన్నై చేతిలో ఓడిన ఢిల్లీ
- బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ఢిల్లీ
- ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్షిష్టం
- 12 మ్యాచుల్లో ఏడింటిలో విజయం సాధించిన చెన్నై
ఓటమిని అలవాటుగా మార్చుకున్న ఢిల్లీ మరోమారు అదే బాటలో నడిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది. బౌలర్ల హవా నడిచిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
168 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ బ్యాటింగ్‌లో మరోమారు దారుణంగా విఫలమైంది. తొలి ఓవర్ రెండో బంతికే కెప్టెన్ వార్నర్ డకౌట్ అయ్యాడు. అది మొదలు వికెట్ల పతనం కొనసాగింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
మనీశ్ పాండే (27), రిలీ రోసౌ (35) కొంత ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఆదుకుంటాడనుకున్న అక్షర్ పటేల్ కూడా (21) కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు. ముఖ్యంగా చెన్నై బౌలర్ మతీషా పతిరన మూడు వికెట్లు తీసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంతకుముందు చెన్నై కూడా బ్యాటింగ్‌లో తడబడింది. మిచెల్ మార్ష్ 3, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టి చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశారు. ఆ జట్టులో శివం దూబే చేసిన 25 పరుగులే అత్యధికం. గైక్వాడ్ 24, కాన్వే 10, రహానే 21, రాయుడు 23, జడేజా 21, ధోనీ 20 పరుగులు చేశారు.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచుల్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలవగా, 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 7 పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి.