Shiv Sena: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. నేడు సుప్రీంకోర్టు తీర్పు

Maharashtra political crisis Supreme Court verdict today

  • నేడు తీర్పు వెలువరించనున్న రాజ్యాంగ ధర్మాసనం
  • మార్చి 16న తీర్పును రిజర్వు చేేసిన సుప్రీంకోర్టు
  • శివసేన వర్గానికి అనుకూలంగా తీర్పు వస్తే మారనున్న రాజకీయ పరిణామాలు
  • మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ

శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ థాకరే-ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఇరు వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.

అసలింతకీ కేసేంటి?
అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది షిండేకు మద్దతు ఇవ్వడంతో ఉద్ధవ్ సారథ్యంలో మహావికాశ్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో షిండే ముఖ్యమంత్రి అయ్యారు.

దీంతో, ఏక్‌నాథ్ షిండే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అప్పటి డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు పంపారు. ఆ విషయం తేలకుండానే షిండేతో అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత ప్రక్రియ డిప్యూటీ స్పీకర్ వద్ద పెండింగులో ఉంది. దీంతో ఈ విషయాన్ని త్వరగా తేల్చాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

మరోవైపు, తిరుగుబాటుదారులపై అప్పటి డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ షిండే వర్గం కూడా పిటిషన్లు దాఖలు చేసింది. 9 రోజులపాటు ఇరు పక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం మార్చి 16న తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఉద్దవ్ థాకరే వర్గానికి అనుకూలంగా వస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News