Amritsar: స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు.. ఐదుగురి అరెస్ట్
- అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు
- వారంలో మూడోసారి
- ఆ ప్రాంతంలో అశాంతి రేకెత్తించడమే లక్ష్యంగా పేలుళ్లు
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. తాజా ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్లు జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. గత అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దీనికి కారకులుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అశాంతి నింపడమే లక్ష్యంగా పేలుళ్లు జరుపుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా పేలుడు సమయంలో అక్కడికి సమీపంలోని ఓ గదిలో ఉన్న ఇద్దరు పురుషులు, ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేలుడు కోసం పొటాషియం క్లోరేట్ను ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీస్ కమిషనర్ నౌనిహాల్ సింగ్ తెలిపారు.
అంతకుముందు మే 6, మే 8న కూడా స్వర్ణ దేవాలయం వీధిలో పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 30 గంటల వ్యవధిలో సంభవించిన ఈ రెండు పేలుళ్లపై విచారణ కోసం పంజాబ్ పోలీసులు దర్యాప్తు సంస్థల సాయం తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల రెండోసారి జరిగిన పేలుడు ప్రాంతాన్ని సందర్శించింది.
తొలి పేలుడు సమయంలో ఓ వ్యక్తి గాయపడగా సమీప భవనాల్లోని అద్దాలు పగిలిపోయాయి. మే 8న సంభవించిన రెండో పేలుడు తీవ్రత కొంత తక్కువే అయినా మరో వ్యక్తి గాయపడ్డాడు. పేలుళ్లకు ఉపయోగించిన ట్రిగ్గర్ కానీ, ఎలాంటి పరికరం కానీ ఆ ప్రాంతంలో పోలీసులకు ఇప్పటి వరకు లభ్యం కాలేదు.