Ambati Rayudu: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు
- రాయుడు వైసీపీలో చేరతాడంటూ ఇటీవల ప్రచారం
- సీఎం జగన్ ప్రసంగాన్ని రీట్వీట్ చేసిన రాయుడు
- రాజకీయాలపై ఆసక్తిని గతంలోనే వెల్లడించిన క్రికెటర్
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్ ప్రసంగాన్ని రీట్వీట్ చేసి చర్చనీయాంశంగా మారిన రాయుడు... ఇప్పుడు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశాడు. తద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. సీఎం జగన్ ను కలిసిన రాయుడు ఏం మాట్లాడాడన్నది ఇంకా తెలియరాలేదు.
కొన్నిరోజుల కిందట సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రసంగించగా, ఆ స్పీచ్ ను అంబటి రాయుడు రీట్వీట్ చేశారు. అంతేకాదు, ఏపీలో ప్రతి ఒక్కరికీ మీపై విశ్వాసం ఉంది సర్ అంటూ వ్యాఖ్యలు చేశాడు.
రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు రాజకీయాల్లోకి రావడంపై కొంతకాలంగా ఆసక్తి చూపిస్తున్నాడు. జనసేనలో చేరతాడని ప్రచారం జరిగింది. టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఓ పత్రికా కథనం పేర్కొంది.
ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాయుడు వైసీపీలో చేరడతానే వాదనలకు బలం చేకూరుతోంది. అంబటి రాయుడు... వికెట్ కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లో గుర్తింపు పొందాడు. టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు.