Samantha: ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘శాకుంతలం’
- థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి ‘శాకుంతలం’
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.. 5 భాషల్లో అందుబాటులోకి
- ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్.. ప్రేక్షకులను ఆకట్టుకోని సినిమా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ ను మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ఎలాంటి ప్రచారం లేకుండా, సైలెంట్ గా గురువారం ఓటీటీలో ప్రత్యక్షమైంది. నిజానికి ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఒక రోజు ముందే రిలీజ్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా అందుబాటులో ఉంది. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్.. దుష్యంతుడి పాత్ర పోషించాడు.
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రుద్రమ దేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. కానీ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు.