mg motors: ఎంజీ మోటార్స్ ఇండియా మెజార్టీ వాటా విక్రయం.. రేసులో రిలయన్స్!
- వాటాదారుల కోసం అన్వేషిస్తోన్న ఎంజీ మోటార్స్ ఇండియా
- రేసులో రిలయన్స్, హీరో గ్రూప్ ముందంజ
- ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి చేయాలని యోచన
చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్స్ అనుబంధ కంపెనీ ఎంజీ మోటార్స్ ఇండియా మెజార్టీ వాటాను విక్రయించాలని చూస్తోంది. ఇందుకోసం దేశీయంగా కొనుగోలుదారుల కోసం అన్వేషిస్తోంది. ఎంజీ మోటార్స్ లో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో గ్రూప్ ముందంజలో ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్, ప్రేమ్ జీ ఇన్వెస్ట్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలుస్తోంది.
ఈ ఏడాది చివరి నాటికి ఈ డీల్ ను పూర్తి చేయాలని ఎంజీ మోటార్స్ ఇండియా యోచిస్తోంది. మెజార్టీ వాటాను విక్రయించడం ద్వారా రూ.5000 కోట్లను సమీకరించే ప్రణాళికలో ఉన్నట్లు ఎంజీ మోటార్స్ ఇండియా తెలిపింది. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్స్ ప్రస్తుతం చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ చేతిలో ఉంది. 2028 వరకు మన దేశంలో కార్యకలాపాలను విస్తరించడం కోసం రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఈ సంస్థ భావిస్తోంది.