america: అమెరికా చట్ట సభలో కొత్త బిల్లుతో భారతీయులకు మరింత ఊరట!
- కొత్త పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమెరికా
- విదేశీయులకు సత్వర పౌరసత్వం కోసం ఉద్దేశించిన బిల్లు
- గ్రీన్ కార్డు, హెచ్1బీ వీసా విధానాల్లో మార్పులు!
అమెరికాలో అధికారిక డెమోక్రటిక్ పార్టీ బుధవారం కొత్త పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టింది. అమెరికాను ఆశ్రయించిన విదేశీయులకు సత్వర పౌరసత్వం కోసం ఉద్దేశించిన ఈ బిల్లులో భారతీయులకు మేలు చేకూర్చేలా గ్రీన్ కార్డు, హెచ్1బీ వీసా విధానాల్లో కొన్ని మార్పులు సూచించారు. గ్రీన్ కార్డుపై దేశాల వారీగా ఉన్న కోటాను తొలగించాలని ప్రతిపాదించారు. యూఎస్ సిటిజన్ షిప్ యాక్ట్ 2023 పేరిట అమెరికా చట్టసభల సభ్యురాలు లిండా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అక్కడి ప్రభుత్వ పరిశీలనలో ప్రమాదరహితులుగా తేలిన విదేశీయులు పన్ను చెల్లిస్తే పదేళ్ల లోపు పౌరసత్వం కల్పించేలా ప్రతిపాదించారు.
స్టెమ్ రంగాల్లో అమెరికా యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదువుకున్న విదేశీయులకు నివాసం మరింత సులభతరం చేయాలనే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. గ్రీన్ కార్డులు త్వరగా జారీ అయ్యేందుకు కొన్ని సూచనలు పొందుపరిచారు. హెచ్1బీ వీసాదారులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు పని చేసుకునే వీలు కల్పించాలని పొందుపరిచారు. హెచ్1బీ వీసాదారుల పిల్లలు వయస్సు మీరి దేశాన్ని వీడే పరిస్థితిని తప్పించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేశారు.