Beer Bike: బీరుతో నడిచే బైక్.. అమెరికా యువకుడి ఆవిష్కరణ
- ట్యాంకు నిండా బీర్లు కొట్టించి 240 కి.మీ. వేగంతో దూసుకుపోవచ్చట
- పెట్రోల్ రేట్లు పెరుగుతుండడంతో ఈ బైక్ ను తయారు చేశానంటున్న యువకుడు
- ఈ మోటార్ సైకిల్ రోడ్డుపైకి వచ్చే అవకాశం లేదంటున్న నిపుణులు
పెట్రోల్ తో నడిచే బైక్ ను చూశాం.. ఎలక్ట్రిక్ బైక్ లు కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ రెండూ కాదూ.. బీర్ తోనూ బైక్ ను పరుగులు పెట్టించవచ్చని అమెరికా యువకుడు ఒకరు నిరూపించారు. సరికొత్త బైక్ ను తయారుచేసి ఔరా అనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ బైక్ ఇంకా రోడ్లపైకి రాలేదు. అయితే, మిన్నెసోటా రాష్ట్రంలో జరిగే స్థానిక ప్రదర్శనలలో ఉత్తమ ఆవిష్కరణ కేటగిరీలో ఇప్పటికే చాలా బహుమతులు గెల్చుకుంది. త్వరలోనే ఈ బైక్ తో రోడ్లపై దూసుకెళ్తానని దీనిని తయారుచేసిన యువకుడు మైఖల్సన్ చెప్పాడు.
పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతుండడంతో ఈ వినూత్న బైక్ ను తయారుచేసినట్లు మైఖల్సన్ వివరించాడు. ఈ బైక్ లో పెట్రోల్ ట్యాంక్ స్థానంలో డ్రమ్మును ఏర్పాటు చేశానని, దాని కింద హీటింగ్ కాయిల్ ను అమర్చానని చెప్పాడు. డ్రమ్ములో బీర్ నింపి హీటింగ్ కాయిల్ ను ఆన్ చేస్తే.. డ్రమ్ములోని బీర్ 300 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరేలా వేడెక్కుతుందని, అప్పుడు డ్రమ్ములో నుంచి వచ్చే ఆవిరి బైక్ ను ముందుకు నెడుతుందని వివరించాడు. దీంతో గరిష్ఠంగా 240 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని మైఖల్సన్ చెప్పాడు.
బ్లూమింగ్టన్ కు చెందిన మైఖల్సన్ ను స్థానికులు రాకెట్ మాన్ గా పిలుస్తుంటారు. ఆయన గతంలోనూ పలు వినూత్న ఆవిష్కరణలు చేశాడు. కాగా, మైఖల్సన్ రూపొందించిన బైక్ స్థానికంగా పలు బహుమతులు గెల్చుకున్నప్పటికీ అది రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు మాత్రం లేవని నిపుణులు చెబుతున్నారు. మైఖల్సన్ ఇంట్లోని మ్యూజియానికే అది పరిమితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.