Netflix: నెట్ ఫ్లిక్స్ పై పన్ను పోటుకు రెడీ అవుతున్న కేంద్రం!
- ఆ సంస్థ భారత్ లో సంపాదించిన ఆదాయానికి పన్ను వేసేందుకు ప్రతిపాదన
- భారత్ లో పన్ను చెల్లించనున్న తొలి విదేశీ డిజిటల్ కంపెనీ కానున్న నెట్ ఫ్లిక్స్
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ కు 55 కోట్ల ఆదాయం
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ పై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వివిధ సినిమాలు, షోలను స్ట్రీమింగ్ చేయడం ద్వారా మన దేశం నుంచి ఆర్జిస్తున్న ఆదాయంపై పన్ను విధించాలని భావిస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. ఈ మేరకు ప్రతిపాదనను సిద్ధం చేసిందని తెలిపింది. దీని ప్రకారం ఇన్ కం ట్యాక్స్ అధికారులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్ భారత్ లో సుమారు 55 కోట్ల (6.73 మిలియన్ డాలర్లు) ఆదాయాన్ని పొందినట్టు తమ నివేదికలో పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సేవలకు మద్దతుగా భారతదేశంలో మాతృ సంస్థ నుంచి కొంతమంది ఉద్యోగులు ఉన్నారని, అనేక మౌలిక సదుపాయాలను కలిగి ఉందని తెలిపారు. ఈ లెక్కన నెట్ ఫ్లిక్స్ సంస్థ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (పీఈ) చట్టానికి లోబడినట్టేనన్నారు. పీఈ పరిధిలోకి వచ్చే సంస్థలు తమ ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దాంతో, నెట్ ఫ్లిక్స్ పై పన్ను విధించేందుకు మార్గం సుగమం కానుంది. అదే జరిగితే వినియోగదారులకు ఎలక్ట్రానిక్ కామర్స్ సేవలను అందించే విదేశీ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడం దేశంలో ఇదే తొలిసారి అవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.