JDS: కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపే.. హంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకున్నామన్న జేడీఎస్
- బీజేపీ, కాంగ్రెస్ లు తమను సంప్రదించాయన్న జేడీఎస్
- జేడీఎస్ ను సంప్రదించలేదన్న బీజేపీ
- హంగ్ వస్తే కింగ్ మేకర్ గా జేడీఎస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగనున్న తరుణంలో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా పలువురు భావిస్తున్నారు. మరోవైపు పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను వెలువరించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో, కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ గా మారనుంది. ఒకవేళ హంగ్ వస్తే... జేడీఎస్ మద్దతు ఇచ్చే పార్టీనే అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటుంది.
ఈ నేపథ్యంలో, జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తమతో సంప్రదింపులు జరిపాయని చెప్పారు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో తాము ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని... సరైన సమయంలో ప్రజలకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని అన్నారు.
మరోవైపు జేడీఎస్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. బీజేపీ నేత శోభా కరంద్లాజే మాట్లాడుతూ... జేడీఎస్ ను బీజేపీ సంప్రదించలేదని చెప్పారు. బీజేపీకి క్లియర్ మెజార్టీ వస్తుందనే నమ్మకం తమకు ఉందని... రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదని అన్నారు. బీజేపీకి 120 సీట్లు కచ్చితంగా వస్తాయనే ధీమాను వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి తమ కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాము ఈ విషయాన్ని చెపుతున్నామని తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం కుమారస్వామి సింగపూర్ లో ఉన్నారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన సింగపూర్ కు వెళ్లారు. రేపు ఉదయం కల్లా ఆయన బెంగళూరుకు చేరుకుంటారు.