Jagan: చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు.. వాళ్ల డ్రామాలు నమ్మకండి: వైఎస్ జగన్
- చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టేనన్న జగన్
- అన్నదాతలకు మేలు జరుగుతుందనే ఓర్వలేక కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
- రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా
- చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని వెల్లడి
- తన పాలనలో న్యాయం జరిగిందని నమ్మితే తనకు అండగా నిలవాలన్న సీఎం
చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ‘‘రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాలు వద్దని, రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పిస్తున్నారు. పొరపాటు జరిగితే రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి ఉండదు. పేదలను ఏపీ నుంచి తరిమేస్తారు’’ అని ఆరోపించారు. సూటు బూటు వేసుకున్న జోకర్లు సంక్షేమ పథకాలను తప్పుపడుతున్నారని విమర్శించారు.
నెల్లూరు జిల్లాలోని కావలిలో చుక్కల భూములపై నిషేధం ఎత్తివేస్తూ రైతులకు హక్కు పత్రాలను సీఎం జగన్ ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్టు జగన్ చెప్పారు. వేల మంది రైతులకు విముక్తి కల్పించామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,06,171 ఎకరాల్లోని చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం దక్కిందన్నారు.
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. రైతులను కోలుకోలేని దెబ్బకొట్టారన్నారు. చుక్కల భూములపై ఇక నుంచి రైతులకు అన్ని హక్కులు దక్కుతాయని, బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చని చెప్పారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదన్నారు. అందుకే చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టుగా జగన్ వివరించారు. రైతన్నల కష్టం తాను స్వయంగా చూసినట్టుగా సీఎం చెప్పారు.
ప్రతి రెవెన్యూ గ్రామంలో భూ సర్వే వేగంగా జరుగుతోందని జగన్ చెప్పారు. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామని, భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 20న మరో 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్.. చంద్రబాబు వైపు నిలబడ్డారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతులకు చంద్రబాబు చాలా అన్యాయం చేశారని ఆరోపించారు. ‘‘అన్నదాతలకు మేలు జరుగుతుందనే కొంతమంది ఓర్వలేక రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు. ఎవరి డ్రామా వాళ్లు ఆడుతున్నారు. వీళ్ల డ్రామాలు నమ్మకండి’’ అని ప్రజలకు జగన్ సూచించారు.
2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు ఏం చేశారని, ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. ఇప్పుడేమో రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పర్యటిస్తున్నారనే తాము రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ‘‘ప్యాకేజీ స్టార్.. ‘మేము వస్తే కానీ ధాన్యం కొనుగోలు చేయలేదు’ అని అంటున్నారు. వీళ్లు వచ్చినా రాకున్నా ఈ 4 ఏళ్లు ఎవరు కొన్నారు?’’ అని జగన్ ప్రశ్నించారు.
అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే చంద్రబాబుకు కడుపు మంట అని జగన్ విమర్శించారు. అందుకే కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘‘ నా పాలనలో మీకు న్యాయం జరిగిందని నమ్మితే నాకు అండగా నిలవండి’’ అని ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో వీళ్లు మరిన్ని అబద్ధాలు చెబుతారని, ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదలు బతికే పరిస్థితి ఉండదని జగన్ హెచ్చరించారు.