Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పై విచారణ... సీబీఐకి కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు

High Court hearing on Raghurama custodial torture petition

  • గతంలో రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ
  • తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న రఘురామ
  • కాల్ డేటాను సేకరించాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు
  • ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సీఐడీ

గతంలో తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన కస్టోడియల్ టార్చర్ పై సీబీఐ విచారణ కోరుతూ రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. 

రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్ డేటా సేకరించాలని సీబీఐని ఆదేశించింది. కాల్ డేటాను స్వాధీనం చేసుకుని భద్రపరచాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐకి నిర్దేశించింది. 

వాదనల సందర్భంగా... టెలికాం నిబంధనలను అనుసరించి కాల్ డేటాను రెండేళ్ల వరకు ఉంచుతారని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ తెలిపారు. అందుకే తక్షణమే డేటాను భద్రపరచాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో కాల్ డేటా ఎంతో కీలకమని పేర్కొన్నారు. 

ఈ విచారణలో సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ సీఐడీ వద్దనే ఉందని, అందుకే కాల్ డేటా కూడా సీఐడీ అధికారులు సేకరించాలని కోర్టుకు తెలిపారు. సీబీఐ న్యాయవాది వాదనలతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణలు చేసింది సీఐడీ మీదే అయితే, కాల్ డేటా సేకరించాలని ఆ సంస్థను ఎలా ఆదేశిస్తామని ప్రశ్నించింది. 

కాగా, ఈ కేసులో సీఐడీ అధికారులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కాల్ డేటా సేకరించాలని చెప్పడం చట్టవిరుద్ధమని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్ ను ఇంకా అనుమతించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను వేసవి సెలవులు ముగిసిన తర్వాత చేపడతామంటూ వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News