charmee: ఫిల్మ్ చాంబర్ ఎదుట లైగర్ ఎగ్జిబిటర్ల ధర్నాపై స్పందించిన చార్మీ
- లైగర్ సినిమాతో భారీ నష్టాలు వచ్చాయని రిలే నిరాహార దీక్షలు
- బాధితులకు న్యాయం చేస్తామని చార్మీ హామీ
- ఫిల్మ్ చాంబర్ కు మెయిల్ సందేశం పంపించిన సినీ నటి
విజయ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమా దారుణ పరాజయం పాలైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తీవ్ర నష్టాలను చవిచూసింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమా వల్ల నష్టపోయిన వారికి సెటిల్ చేసేందుకు పూరీ జగన్నాథ్ గతంలో అంగీకరించారు. తాజాగా నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. లైగర్ సినిమాతో తమకు భారీ నష్టాలు వచ్చాయని, తమను ఆదుకోవాలని కోరుతూ నిరసన తెలిపారు. ఆర్థికంగా నష్టపోయిన తమకు పూరీ జగన్నాథ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ నేటి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సినీ నటి చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫిల్మ్ చాంబర్ కు మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించారు. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.