TTD: వేసవి రద్దీ కారణంగా భక్తులు టీటీడీకి సహకరించాలి: ఈవో ధర్మారెడ్డి

TTD EO Dharma Reddy on Venkateswara darshanam

  • 14 నుండి 18వ తేదీ వరకు హనుమత్ జయంత్యుత్సవాలు
  • శనివారం శ్రమదానంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాల్గొంటారన్న ఈవో
  • దర్శనానికి వచ్చే భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి
  • నడక మార్గంలో వెళ్లే భక్తులకు 1240 మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శనివారం ఉదయం రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో శ్రమదానం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారని తెలిపారు. హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఐదు రోజుల పాటు ఐదుగురు పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేస్తారని తెలిపారు. 

వేసవి కారణంగా తిరుమలలో రద్దీ ప్రారంభమైందని చెప్పారు. రోజుకు శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు కలిపి 55వేలు కేటాయిస్తున్నట్లు ఈవో తెలిపారు. సర్వదర్శనంలో రోజుకు పది నుండి 15వేల మందికి మాత్రమే దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులు ఓపికతో ఉంటూ టీటీడీకి సహకరించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్ లో పాదరక్షలు భద్రపరిచే కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో పీఏసీ 1, 2, 3, నారాయణగిరి క్యూలైన్లు, రాంభగీచా, సుపథం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కూడా ప్రారంభిస్తామన్నారు.

శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ఎప్పటిలాగే 1240 మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ వెనుక గోవిందరాజ స్వామి సత్రాలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని, లేదంటే స్లాటెడ్ దర్శనానికి అనుమతించబోమన్నారు. నకిలీ వెబ్ సైట్ల కారణంగా మోసపోవద్దని సూచించారు.

  • Loading...

More Telugu News