Pawan Kalyan: నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఇన్ని పార్టీలు లేవు: పవన్ కల్యాణ్
- మంగళగిరిలో పార్టీ శ్రేణులతో పవన్ సమావేశం
- తాను ఇప్పటికిప్పుడు సీఎం అవడం కష్టమేనని వ్యాఖ్యలు
- ఎన్టీఆర్ కాలంలో పరిస్థితులు వేరని వెల్లడి
- ఇప్పటి పరిస్థితులు ఎంతో భిన్నం అని స్పష్టీకరణ
మంగళగిరిలో జనసేన పార్టీ మండల స్థాయి అధ్యక్షుల సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఓట్లు వేస్తేనే కదా నేను సీఎం అయ్యేది అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో ఇన్ని పార్టీలు లేవని, అప్పుడున్న పరిస్థితులు వేరని, అప్పుడున్న వ్యక్తులు కూడా వేరని పవన్ కల్యాణ్ వివరించారు. ఉపేంద్ర, నాదెండ్ల భాస్కరరావు, ఎన్జీ రంగా వంటి నాయకులు ఎన్టీఆర్ కు దిశానిర్దేశం చేశారని తెలిపారు.
అప్పుడు ప్రధాన పార్టీ అంటే కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. డబ్బు, పగ, ప్రతీకారాలు అప్పట్లో లేవని పేర్కొన్నారు. ఇప్పుటి పరిస్థితులు ఎంతో భిన్నం అని, ఒక్కో అడుగు వేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నానని స్పష్టం చేశారు.
పాప్యులారిటీ ఉంటే సీఎం అవుతామంటే ఇప్పుడు వీలు కాదని అన్నారు. పాప్యులారిటీతో రాత్రికి రాత్రి సీఎం అవడం ఓ కల వంటిదని, అది ఎన్టీఆర్ కు కుదిరిందేమో కానీ, తాను అలాంటిది కలలో కూడా ఊహించలేనని పవన్ తెలిపారు.
ఏపీ బాగుంటేనే పవన్ బాగుంటాడని, అంతే తప్ప రాష్ట్రం బాగాలేకపోతే మనం ఎలా బాగుంటాం అని ప్రశ్నించారు. తానేమీ అజాత శత్రువును కానని, రాష్ట్రం బాగు కోసం కొందరికి శత్రువుగా మారాలంటే అందుకు తాను సిద్ధమని ప్రకటించారు. నన్ను ఎన్ని మాటలు అంటే అంత రాటుదేలతాను అని సమరశంఖం పూరించారు.
నడక కూడా రాని నా పిల్లలను దూషించారు, నన్ను తిట్టారు... పోగొట్టుకోవడానికి నా వద్ద ఏమీలేదు... అవమానాలు, ఓటములు, తిట్లు అన్నీ ఎదుర్కొని నిలబడ్డాను అని పేర్కొన్నారు. అవసరం అయినప్పుడు తగ్గడం, తిరగబడడం రెండూ తనకు తెలుసని పవన్ స్పష్టం చేశారు.
విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు జనసేనకు 25 శాతం ఓటు బ్యాంకు ఉందని వెల్లడించారు. సగటున జనసేన ఓటింగ్ శాతం 18 అని, గోదావరి జిల్లాల్లో 36 శాతం ఉందని వివరించారు. భీమవరంలో ఏకంగా 18 వేల దొంగ ఓట్లు వేశారని, ఈసారి అలాంటివి లేకుండా చూసుకుందామని పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.