Mumbai Indians: రషీద్ ఖాన్ 10 సిక్సులు బాదినా...  ముంబయి ఇండియన్సే గెలిచింది!

Mumbai Indians claims win despite Rashid Khan flamboyant innings

  • మరో విజయం ఖాతాలో వేసుకున్న ముంబయి ఇండియన్స్
  • గుజరాత్ టైటాన్స్ పై 27 పరుగుల తేడాతో విక్టరీ
  • బ్యాటింగ్ లో రషీద్ ఖాన్ మెరుపుదాడి
  • 32 బంతుల్లో 79 రన్స్ కొట్టిన రషీద్
  • 3 ఫోర్లు, 10 సిక్సులతో వీరవిహారం

ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ నెగ్గినా...  ఆ గెలుపు వారికేమీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. కారణం... గుజరాత్ ఆటగాడు రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్సే. 

219 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో... ఆ జట్టు కథ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదనిపించింది. కానీ రషీద్ ఖాన్ చిచ్చరపిడుగులా విజృంభించి ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ను కకావికలం చేశాడు. 

భారీ షాట్లతో విరుచుకుపడిన రషీద్ ఖాన్ 21 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. రషీద్ ఖాన్ కు ఐపీఎల్ లో ఇదే తొలి అర్ధసెంచరీ. ఓ దశలో కాలి నొప్పితో కుంటుతూ కనిపించిన రషీద్ బాదుడులో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆఖరి ఓవర్లో సైతం 3 సిక్సులు బాదడం విశేషం. మొత్తం 32 బంతులు ఆడిన రషీద్ ఖాన్ 3 ఫోర్లు, 10 సిక్సులతో అజేయంగా 72 పరుగులు చేసి మోత పుట్టించాడు. 

ఆఖరికి గుజరాత్ టైటాన్స్ ఛేజింగ్ లో 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. రషీద్ విధ్వంసక ఇన్నింగ్స్ తో ప్రేక్షక పాత్రకే పరిమితమైన ముంబయి ఇండియన్స్ చివరికి 27 పరుగుల తేడాతో నెగ్గింది. రషీద్ ఊపు చూస్తే మరో రెండు ఓవర్లు మిగిలుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదనిపించింది. రషీద్ ఖాన్ కు అల్జారీ జోసెఫ్ విశేష సహకారం అందించాడు. జోసెఫ్ చేసింది 7 పరుగులే అయినా... రషీద్ ఇన్నింగ్స్ కొనసాగడానికి అతడే ఆయువుపట్టు అయ్యాడు. 

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ లో సాహా (2), గిల్ (6), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4) ఘోరంగా విఫలమయ్యారు. విజయ్ శంకర్ 29, డేవిడ్ మిల్లర్ 41 పరుగులతో రాణించారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో దేశవాళీ కుర్రాడు ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లతో రాణించగా... పియూష్ చావ్లా 2, కుమార్ కార్తికేయ 2 వికెట్లు పడగొట్టారు. జాసన్ బెహ్రెండార్ఫ్ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు, సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. డాషింగ్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. సూర్య 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ముంబయి 7 విజయాలు సాధించింది. 12 మ్యాచ్ లలో 8 విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News