Karimnagar District: తాళి కట్టే సమయంలో బైక్ కోసం అలిగిన వరుడు.. రూ. 50 వేలు ఇచ్చి పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్!

MLA Rasamai Balakishan gave Rs 50000 to groom for bike behalf of bride

  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఘటన
  • బైక్ కొనిస్తేనే వధువు మెడలో తాళి కడతానన్న వరుడు
  • పెళ్లి కుమార్తెకు డబ్బులిచ్చి వరుడికి ఇప్పించిన రసమయి
  • మిగతా డబ్బులు షోరూములో తానే చెల్లిస్తానన్న ఎమ్మెల్యే

సరిగ్గా తాళి కట్టే సమయంలో బైక్ కావాలంటూ వరుడు అలిగాడు. అది కొనిస్తేనే పెళ్లి జరుగుతుందని పందిట్లో పేచీ పెట్టాడు. దీంతో అప్పటి వరకు బంధుమిత్రుల కోలాహలంతో సందడిగా ఉన్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యంతో పెళ్లి జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జరిగిందీ ఘటన.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంబాల్‌పూర్ మాజీ సర్పంచి లచ్చమ్మ కుమార్తె అనూషకు సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన సంగాల వినయ్‌కు నిన్న వివాహం జరిగింది. తాళి కట్టడానికి ముందు వరుడు బైక్ కావాలంటూ పేచీ పెట్టడంతో మండపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వాహనం కోసం వధువు తల్లిదండ్రులతో పీటలపై నుంచే వాగ్వివాదానికి దిగాడు. అది కొనిస్తేనే తాళి కడతానని తేల్చి చెప్పాడు. 

అదే సమయంలో వివాహ వేడుకకు వచ్చిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విషయం తెలిసి వరుడికి నచ్చ జెప్పారు. వధువు అనూషకు రూ. 50 వేల నగదు ఇచ్చి దానిని ఆమె చేతుల మీదుగా వరుడికి ఇప్పించారు. బైక్ కొనే సమయంలో షోరూములో మిగతా సొమ్మును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ తర్వాత వివాహం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెళ్లి కుమార్తెది చాలా పేద కుటుంబమని, పందిట్లో పెళ్లి ఆగకూడదన్న ఉద్దేశంతోనే ఆర్థికసాయం చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News