snoring: పెరిగిపోతున్న గురక సమస్య.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే
- ఫ్రాన్స్ లో ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఈ సమస్య
- మన దేశంలోనూ నాలుగు కోట్ల మంది బాధితులు
- నిద్ర సమయంలో పెద్దగా గురక రావడం దీని లక్షణం
- శ్వాస తీసుకోవడం ఆపివేసి, కొన్ని సెకండ్లకు మళ్లీ తీసుకుంటారు
ఇటీవల ఈఆర్జే ఓపెన్ రీసెర్చ్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఫలితాలను గమనిస్తే.. ఫ్రాన్స్ లో 20 శాతం జనాభాలో గురక సమస్య (అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా) ఉన్నట్టు తెలుస్తోంది. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సమస్య ఉన్న వారిలో (ఓఎస్ఏ) కనిపించే ముఖ్య లక్షణం గురక. గురక కూడా పెద్దగా వస్తుంటుంది. దీంతో నిద్రలోనే పలు సార్లు మేల్కొంటూ ఉంటారు. దీనివల్ల అలసి పోవడమే కాదు అధిక బ్లడ్ ప్రెజర్, స్ట్రోక్, గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం బారిన పడే రిస్క్ అధికంగా ఉంటుంది. వైద్యులను సంప్రదిస్తే చికిత్సతోపాటు జీవనశైలిలో మార్పులను సూచిస్తారు. ఫ్రాన్స్ లో అంత కాకపోయినా మన దేశంలోనూ ఓఎస్ఏ బాధితులు 3-4 కోట్ల మంది ఉంటారని అంచనా.
నిజానికి గురక సమస్య ఉన్నవారిలో చాలా మందికి తాము గురక పెడుతున్నట్టు తెలియదు. కనుక ఓఎస్ఏ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు. కాకపోతే మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు.
మయో క్లినిక్ ప్రకారం.. ఓఎస్ఏ అన్నది నిద్రకు సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య. నిద్రలో శ్వాస తీసుకోవడాన్ని ఆపివేసి, ఒక్కసారిగా ఉలిక్కి పాటుతో తిరిగి శ్వాస తీసుకుంటూ ఉంటారు. స్లీప్ ఆప్నియాలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఓఎస్ఏ ఒకటి. దీనికి చికిత్సలు ఉన్నాయి. శ్వాసనాళాన్ని ప్రెజర్ తో తెరిచి ఉంచేలా పరికరాన్ని సూచిస్తారు. మరొకటి మౌత్ పీస్. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఏదైనా గురక వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది.