MK Stalin: సోనియా, రాహుల్ గాంధీలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్
- కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు
- మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు
- ఇప్పటివరకు 97 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్... 34 స్థానాల్లో ముందంజ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ 97 స్థానాల్లో నెగ్గి, 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా, అందుకు మరో 16 స్థానాల దూరంలో ఉంది. అధికార బీజేపీ 48 స్థానాల్లో నెగ్గి, మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీ (ఎస్) 14 స్థానాల్లో గెలిచి, 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు.
కాగా, కాంగ్రెస్ ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. గత కొన్నాళ్లుగా మోదీ ప్రాభవం ముందు కాంగ్రెస్ వెలవెలపోతోంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కానీ, కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీని మట్టి కరిపించామన్న ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.
ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఫోన్ చేసి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళి పట్ల సోనియా, రాహుల్ లకు ఆయన అభినందనలు తెలిపారు. అటు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలకు కూడా స్టాలిన్ ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.