Shivashankarappa: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 92 ఏళ్ల ‘రేసు గుర్రం’ గెలిచింది!

most senior candidate Shivashankarappa won in karnataka elections

  • దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి గెలిచిన శివశంకరప్ప
  • 28 వేల ఓట్ల మెజారిటీతో విజయం
  • కర్ణాటక ఎన్నికల చరిత్రలో వృద్ధ అభ్యర్థిగా బరిలోకి దిగి రికార్డు సృష్టించిన సీనియర్ నేత

కొన్ని రోజుల కిందటి కథ.. 92 ఏళ్ల నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.శివశంకరప్పకు కాంగ్రెస్ మరోసారి టికెట్ ఇచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘‘92 ఏళ్ల వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు? ప్రజలు ఆయనకు ఓటు వేస్తారా? ఆయన గెలిచి ఏం చేస్తారు?’’ అంటూ సొంత పార్టీ నాయకులే మండిపడ్డారు.

దీంతో దీటుగా బదులిచ్చిన శివశంకరప్ప.. ‘‘నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని చెప్పారు. మాటలతోనే కాదు.. చేతల్లోనూ చూపించారు. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.

కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా బరిలోకి దిగి శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా, ఆయన సమీప బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ కు 56,410 ఓట్లు పడ్డాయి. 

శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2018, 2023లో వరుసగా గెలుపొందారు. మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు పోటీగా బీజేపీ అజయ్‌కుమార్‌ను నిలబెట్టింది. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలతో అజయ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు తాము ‘అప్పాజీ’ అని పిలుచుకునే శివశంకరప్పకే మరోసారి పట్టం కట్టారు.

  • Loading...

More Telugu News