Virat Kohli: కెప్టెన్ గా ఎన్నో తప్పులు చేశా: విరాట్ కోహ్లీ
- కెప్టెన్‌గా తప్పులు చేశానని అంగీకరించడానికి తనకు ఎలాంటి సిగ్గు లేదన్న కోహ్లీ
- తన స్వార్థం కోసం ఎప్పుడూ, ఏమీ చేయలేదని వ్యాఖ్య
- జట్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో వైఫల్యాలు జరుగుతుంటాయని వెల్లడి
ఆటగాడిగా ఎన్నో ఘనతలు అందుకున్న, మరెన్నో రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీమిండియా కెప్టెన్ గా మాత్రం విఫలమయ్యాడు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్స్ పగ్గాలు అందుకున్న తర్వాత ఒక్క మేజర్ ఐసీసీ ట్రోఫీని కూడా గెలిపించలేకపోయాడు. ఇదే విషయంపై స్పందించిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్ గా తాను ఎన్నో తప్పులు చేశానని ఒప్పుకున్నాడు.
డిస్నీ హాట్‌స్టార్‌లో ‘లెట్ దేర్ బి స్పోర్ట్’ పేరుతో ఓ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను చాలా తప్పులు చేశా. దీన్ని అంగీకరించడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. కానీ నా స్వార్థం కోసం నేను ఎప్పుడూ ఏమీ చేయలేదనే విషయం నాకు కచ్చితంగా తెలుసు. జట్టును ముందుకు తీసుకెళ్లడమే నా ఏకైక లక్ష్యం. ఈ క్రమంలో వైఫల్యాలు జరుగుతుంటాయి’’ అని చెప్పుకొచ్చాడు.
కోహ్లీ తర్వాత టీమిండియా పగ్గాలను రోహిత్ శర్మ అందుకున్నాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీని కూడా 2021లో కోహ్లీ వదులుకున్నాడు. ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 42 సగటుతో 420 పరుగులు చేశాడు.