Gali Janardhan Reddy: కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబానికి తీవ్ర నిరాశ.. ముగ్గురి ఓటమి
- గాలి కుటుంబంలో నలుగురు పోటీ చేస్తే ముగ్గురు ఓటమి
- కేవలం జనార్దన్ రెడ్డి మాత్రమే విజయం సాధించిన వైనం
- భార్య లక్ష్మి, సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకర్ రెడ్డి పరాజయం
ఒకప్పుడు కర్ణాటక రాజకీయాల్లో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం తనదైన ముద్రను వేసింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ కుటుంబం ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. కుటుంబం నుంచి నలుగురు పోటీ చేస్తే కేవలం గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. సొంతంగా కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో గాలి జనార్దన్ రెడ్డి పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తరపున 15 మంది బరిలోకి దిగితే... కేవలం గాలి మాత్రమే గెలిచారు. ఆయన గంగావతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
బళ్లారి పట్టణ నియోజకర్గం నుంచి బరిలోకి దిగిన జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మి ఓటమిపాలయ్యారు. ఇదే బళ్లారి పట్టణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా పరాజయం చెందారు. ఈ నియోజవర్గం లో గాలి జనార్దన్ రెడ్డి భార్య, సోదరుడు ఇద్దరూ పోటీ పడటం గమనార్హం. ఇద్దరి మధ్య పోటీ కాంగ్రెస్ పార్టీకి లాభించింది. గాలి కుటుంబానికి కంచుకోటగా ఉన్న బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి గెలుపొందారు.
ఇంకోవైపు హరపనహళ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మరో సోదరుడు కరుణాకర్ రెడ్డి కూడా పరాజయం చెందారు. దీంతో ఈ ఎన్నికలు గాలి కుటుంబానికి తీవ్ర నిరాశను మిగిల్చాయనే చెప్పుకోవచ్చు. మరోవైపు గాలికి ప్రధాన అనుచరుడైన బి.శ్రీరాములు కూడా బీజేపీ తరపున పోటీ చేసి బళ్లారి రూరల్ నియోజకవర్గం నుంచి ఓటమిపాలు కావడం గమనార్హం.