Heat Wave: రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఏపీలో భానుడి విశ్వరూపం
- ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
- మే 14 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు
- అనేక మండలాల్లో వడగాడ్పులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మోఖా తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొంది. అనేక ప్రాంతాల్లో ఎండ వేడిమికి తోడు వడగాడ్పులు వీస్తున్నాయి. కాగా, ఏపీలో రేపటి నుంచి మూడ్రోజులు పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మే 14న కోనసీమ అంబేద్కర్, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం, ఏలూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
అన్నమయ్య, చిత్తూరు, శ్రీకాకుళం, తిరుపతి, నంద్యాల, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది.
మే 15న మన్యం, కాకినాడ, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఎండలు మండిపోతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, తిరుపతి, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
మే 16న అనకాపల్లి, విజయనగరం, అల్లూరి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ అంబేద్కర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
అదే సమయంలో... అనంతపురం, నంద్యాల, విశాఖపట్నం, వైఎస్సార్ కడప, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అదే సమయంలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.
భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని సూచించారు. వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మంచినీరు, కొబ్బరినీరు, మజ్జిగ, లస్సీ, ఓఆర్ఎస్, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు.