BJP: కర్ణాటక ఫలితాలు.. రీకౌంటింగ్ లో 16 ఓట్లతో గట్టెక్కిన బీజేపీ అభ్యర్థి
- బీజేపీ ఖాతాలో మరో సీటు.. మొత్తంగా 66 సీట్లు దక్కించుకున్న కమలం పార్టీ
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి రీకౌంటింగ్ కోరిన బీజేపీ అభ్యర్థి రామమూర్తి
- రీకౌంటింగ్ లో మోసపూరితంగా ఫలితాన్ని మార్చారంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న బెంగళూరు జయనగర్ నియోజకవర్గ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. తొలుత వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపై బీజేపీ అభ్యర్థి రామమూర్తి రీకౌంటింగ్ కు అభ్యర్థించగా.. మరోమారు ఓట్లను లెక్కించిన అధికారులు 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో రామమూర్తి గెలుపొందారని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ సందర్భంగా మోసపూరితంగా ఫలితాన్ని మార్చేశారంటూ అధికారులపై ఆరోపణలు గుప్పించారు.
బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో బీజేపీ తరఫున సీకే రామమూర్తి, కాంగ్రెస్ పార్టీ తరఫున సౌమ్యా రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. తొలుత వెలువడిన ఫలితాలలో సౌమ్యా రెడ్డి మెజారిటీలో ఉండగా.. రామమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ లో పొరపాటు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఫలితాన్ని వెల్లడించకుండా అధికారులు ఆపేశారు.
రామమూర్తి రీకౌంటింగ్ కు అభ్యర్థించగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరిగి లెక్కించారు. ఈసారి రామమూర్తికి 16 ఓట్ల స్వల్ప ఆధిక్యత లభించింది. దీంతో బీజేపీ అభ్యర్థి రామమూర్తి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విజయంతో బీజేపీ ఖాతాలో మరో సీటు చేరింది. మొత్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 66 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.