Tamilnadu: నాగపట్టణంలో తీరం నుంచి 500 అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం
- భయాందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు..
- మూడు రోజులుగా వెనక్కి మళ్లుతున్న సముద్రపు నీరు
- తీరానికి కొట్టుకొచ్చిన చెత్తాచెదారం.. తమిళనాడులో మోఖా తుఫాను ఎఫెక్ట్
తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వేదారణ్యంలో సముద్ర తీరంలో నీళ్లు వెనక్కిమళ్లాయి. శనివారం తీరం నుంచి దాదాపు 500 అడుగుల మేర వెనక్కి తగ్గాయి. గత రెండు, మూడు రోజులుగా ఇలాగే జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తీరానికి దగ్గర్లో ఉంటున్న జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న ఆర్కాడుతురై నుంచి వేదారణ్యం సముద్రతీరం వరకు సుమారు 100 అడుగుల దూరం సముద్రం వెనక్కివెళ్లింది.
ఈ నెల 12న కూడా సముద్రం వెనక్కివెళ్లింది. తాజాగా శనివారం 500 అడుగులు వెనక్కి వెళ్లడంతో చెత్తాచెదారం తీరానికి కొట్టుకొచ్చింది. అయితే, మోఖా తుఫాను ప్రభావం వల్లే సముద్రం వెనక్కి వెళ్లి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి మోఖా తుఫానుగా బలపడింది.
తుఫాను ప్రభావంతో నాగపట్టణం జిల్లాలోని వేదారణ్యం, కొడియకరై, ఆర్కాడుతురై, పుష్పవనం, ఎల్లపల్లం తదితర గ్రామాల్లోని మత్స్యకారుల జీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో వారం రోజులుగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడంలేదు. దాదాపుగా ఐదు వేల మందికి పైగా మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు.