Perni Nani: చిరంజీవి 60 ఏళ్ల వయసులో హిట్ కొట్టారు... నీవన్నీ కాపీలు, రీమేక్ లే!: పవన్ పై పేర్ని నాని విమర్శలు
- మంచి సినిమా తీస్తే ఎవరైనా చూస్తారన్న పేర్ని నాని
- చీప్ గా సినిమాలు చుట్టేసి మాపై ఆరోపణలు చేస్తే ఎలా అంటూ ఆగ్రహం
- మంచి కథ వెతుక్కుని ఒరిజినల్ సినిమాలు తీయాలని హితవు
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. భీమ్లా నాయక్ సినిమా సరిగా ఆడకపోతే, అందుకు తమను నిందించడం సరికాదని పేర్నినాని హితవు పలికారు. సినిమా బాగా లేకపోతే ఎవరేం చేస్తారని ప్రశ్నించారు.
"చిరంజీవి భిక్షతో నువ్వు సినిమాల్లోకి వచ్చావు. కానీ ఆ మహనీయుడి తమ్ముడ్ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడే నువ్వు ఓ కానిస్టేబుల్ కొడుకునని చెబుతుంటావు. మీ అన్నయ్య చిరంజీవి 60 ఏళ్ల వయసులో వాల్తేరు వీరయ్య సినిమా తీశారు. సినిమా బాగుంది కాబట్టి ప్రజలు ఆదరించారు. వాల్తేరు వీరయ్యకు బ్రహ్మాండంగా కలెక్షన్లు వచ్చాయి.
నువ్వు కూడా వాల్తేరు వీరయ్య లాంటి సినిమా తీస్తే డబ్బులొస్తాయి. సినిమా కోసం ఏదైనా ఖర్చు పెడితే కదా ఆ సినిమా బాగా వచ్చేది... అలా కాకుండా, బ్లాక్ అండ్ వైట్ కలిపి నీ పాటికి నువ్వు ఓ 50-70 (కోట్లు) జేబులో వేసుకుని, చీప్ గా సినిమా చుట్టేస్తే ఎవరు చూస్తారు? నీ రెమ్యునరేషన్ నీకు ముడితే సరిపోతుందా? సినిమా బాగా రావాల్సిన అవసరం లేదా? నీ సినిమాల్లో బాగా దున్నేసిన సినిమా ఏమైనా ఉందా?
మంచి సినిమా తీసి మాట్లాడండి... అన్నీ డబ్బింగ్ సినిమాలు, కాపీ సినిమాలు, రీమేక్ లేనా? మంచి కథ వెతుక్కుని సినిమా తీయి... అలాకాకుండా ఏదో ఒక భాషలో వచ్చిన సినిమాను రీమేక్ చేయాలి... డబ్బులు లోపల వేసుకోవాలి అనే ఆత్రంలో ఉంటే సినిమా ఎలా బాగుంటుంది?" అంటూ పేర్ని నాని హితవు పలికారు.
ఇక, రాష్ట్రంలో రాజకీయాల్లో కులం గురించి మాట్లాడే నేత పవన్ కల్యాణ్ ఒక్కరేనని పేర్ని నాని మండిపడ్డారు. రాజకీయ నేతలందరూ కులం గురించి మాట్లాడే పరిస్థితికి పవన్ కల్యాణే కారణమని అన్నారు. పవన్ కల్యాణ్ వన్నీ మోసపు మాటలేనని, చంద్రబాబు కోసం బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు.