RCB: ఆఖర్లో అనుజ్ మెరుపుదాడి... పోరాడదగిన స్కోరు సాధించిన ఆర్సీబీ
- జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
- డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ అర్ధసెంచరీలు
- 11 బంతుల్లోనే 29 పరుగులు చేసిన అనుజ్
- లక్ష్యఛేదనలో రాజస్థాన్ కు ఆరంభంలో ఎదురుదెబ్బ
- యశస్వి జైస్వాల్ ను డకౌట్ చేసిన సిరాజ్
- ఒకే ఓవర్లో బట్లర్, శాంసన్ లను అవుట్ చేసిన పార్నెల్
రాజస్థాన్ రాయల్స్ తో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కినప్పటికీ, దాన్ని మరింత భారీ స్కోరుగా మలచడంలో విఫలమైంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.
ఆఖర్లో అనుజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో బెంగళూరుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అనుజ్ కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 29 పరుగులు చేశాడు. అంతకుముందు, విరాట్ కోహ్లీ 18 పరుగులే వెనుదిరగ్గా... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్ జోడీ అర్ధసెంచరీలతో రాణించింది. డుప్లెసిస్ 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 55 పరుగులు... మ్యాక్స్ వెల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేశారు.
లోమ్రోర్ (1), దినేశ్ కార్తీక్ (0) నిరాశపరిచారు. అయితే అనుజ్ రావత్ దూకుడుగా ఆడడంతో ఆర్బీబీ స్కోరు 150 మార్కు దాటింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 2, కేఎం ఆసిఫ్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.
కాగా, 172 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ కు ఆరంభంలో షాక్ తగిలింది. భీకర ఫాంలో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ను సిరాజ్ డకౌట్ చేశాడు. ఓ భారీ షాట్ కు యత్నించిన జైస్వాల్... సర్కిల్లో కోహ్లీ చేతికి చిక్కాడు.
ఆ తర్వాత ఓవర్లోనే రాజస్థాన్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేన్ పార్నెల్ బౌలింగ్ లో స్క్వేర్ కట్ కొట్టబోయిన ఓపెనర్ జోస్ బట్లర్... సిరాజ్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. అదే ఓవర్లో కెప్టెన్ సంజూ శాంసన్ (4) కూడా అవుట్ కావడంతో దాంతో రాజస్థాన్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.