Congress: నూతన సీఎంను ఎన్నుకునేందుకు కర్ణాటక సీఎల్పీ సమావేశం
- కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం
- 224 స్థానాలకు గాను 135 గెలిచిన కాంగ్రెస్
- ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పరిశీలకుల భేటీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ సాయంత్రం 5.30 గంటలకు బెంగళూరులో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో నూతన సీఎం ఎవరన్నది ప్రధానంగా చర్చించనున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
సీఎల్పీ భేటీ కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు పరిశీలకులను నియమించింది. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియా పరిశీలకులుగా వ్యవహరిస్తారు.
సీఎం పదవి రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. శివకుమార్ ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ హైకమాండ్ కు నమ్మినబంటుగా పేరొందారు. అటు, సిద్ధరామయ్య తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవం ఉంది.
ఈసారి సీఎల్పీ నేతగా ఎన్నికైతే సిద్ధరామయ్యకు రెండోసారి సీఎం అయ్యే చాన్స్ లభిస్తుంది. ఆయన తొలిసారి 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సిద్ధరామయ్య క్యాబినెట్ లో డీకే శివకుమార్ మంత్రిగా పనిచేశారు.
కాగా, డీకే శివకుమార్ వ్యాఖ్యానిస్తూ... తనకు సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. తనకు పార్టీయే ముఖ్యమని, పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. తాను పార్టీ కోసం ఇప్పటికే ఎన్నోసార్లు త్యాగం చేశానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సిద్ధరామయ్యకు సంపూర్ణ సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
సీఎం ఎంపిక కోసం అధిష్ఠానం ముగ్గురు పరిశీలకులను పంపిందని వెల్లడించారు. పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి అందజేస్తారని వివరించారు. సీఎం ఎంపిక విషయంలో అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కర్ణాటక నూతన సీఎం ఎంపిక విషయంలో ఎలాంటి వివాదం లేదని ఖర్గే స్పష్టం చేశారు.
కాగా, ఇవాళ సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్న పరిశీలకులు... రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరును రేపు, లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.