RCB: బెంగళూరు సంచలన బౌలింగ్... 59 పరుగులకే రాజస్థాన్ కుదేల్

RR bundled out for 59 runs after RCB sensational bowling

  • జైపూర్ లో బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు
  • లక్ష్యఛేదనలో 10.3 ఓవర్లలోనే కుప్పకూలిన రాజస్థాన్
  • చెలరేగిన బెంగళూరు బౌలర్లు 

యశస్వి జైస్వాల్ వంటి చిచ్చరపిడుగు సూపర్ ఫాంలో ఉన్న వేళ రాజస్థాన్ రాయల్స్ 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదని ఎవరైనా అనుకుంటారా...? కానీ క్రికెట్ ఎంతో విచిత్రమైంది. ఒక్క బంతి చాలు తలరాత మార్చేయడానికి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో ఇలాంటి అనూహ్య పరిణామాలే చోటు చేసుకున్నాయి. 

172 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకు కుప్పకూలింది. కేవలం 10.3 ఓవర్లలోనే వికెట్లన్నీ కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా... కెప్టెన్ సంజూ శాంసన్ (4), జో రూట్ (10) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 

షిమ్రోన్ హెట్మెయర్ ఒక్కడు ధాటిగా ఆడాడు. హెట్మెయర్ 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 35 పరుగులు చేశాడు. అతడు అవుటయ్యాక రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. దేవదత్ పడిక్కల్ (4) ధ్రువ్ జురెల్ (1), రవిచంద్రన్ అశ్విన్ (0), ఆడమ్ జంపా (2), కేఎం ఆసిఫ్ (0) ఇలా వచ్చి అలా వెనుదిరిగారు. 

బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 1, వేన్ పార్నెల్ 3, మైకేల్ బేస్వెల్ 2, కర్ణ్ శర్మ 2, గ్లెన్ మ్యాక్స్ వెల్ 1 వికెట్ పడగొట్టారు. 

మొత్తమ్మీద రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో గెలవడమే కాదు, రన్ రేట్ బాగా మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ రన్ రేట్ 0.166. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడు నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ ఐదు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది.

  • Loading...

More Telugu News