KKR: ధోనీ సేనలో దూకుడు తగ్గింది... ఈ స్కోరే నిదర్శనం!
- ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చెన్నై
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 రన్స్
- 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన శివమ్ దూబే
- రాణించిన మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్
ఐపీఎల్ లో బలమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మందకొడిగా బ్యాటింగ్ చేసింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో దూకుడు ప్రదర్శించలేకపోయింది. సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో ఆడుతున్నప్పటికీ ఆ అనుకూలతను సొమ్ముచేసుకోలేకపోయింది.
ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేసింది. యువ ఆటగాడు శివమ్ దూబే కాస్త బ్యాట్ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. శివమ్ దూబే 34 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 48 పరుగులు చేశాడు.
జడేజా 24 బంతుల్లో 20 పరుగులు చేయగా... ఓపెనర్ డెవాన్ కాన్వే 28 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 17, అంబటి రాయుడు 4, మొయిన్ అలీ 1, రహానే 16 పరుగులు చేశారు.
కోల్ కతా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2 వికెట్లతో రాణించారు. వైభవ్ అరోరా 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.