Nitish Rana: సీఎస్కే నుంచి మ్యాచ్ ను లాగేసుకున్న నితీశ్, రింకూ జోడీ
- సొంతగడ్డపై ఓడిన చెన్నై సూపర్ కింగ్స్
- చెపాక్ స్టేడియంలో చెన్నై వర్సెస్ కోల్ కతా
- 6 వికెట్ల తేడాతో నెగ్గిన కోల్ కతా
- 145 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించిన వైనం
- అర్ధసెంచరీలతో రాణించిన నితీశ్ రాణా, రింకూ సింగ్
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ఓటమిపాలైంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
ఓ దశలో సీఎస్కే బౌలర్లు విజృంభించడంతో కోల్ కతా 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. అయితే కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ ల జోడీ సమయోచితంగా ఆడుతూ చెన్నై చేతుల్లోంచి మ్యాచ్ ను లాగేసుకుంది. వీరిద్దరూ 100కి పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
చివర్లో రింకూ రనౌట్ కావడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. నితీశ్ రాణా 44 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. రింకూ 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
అంతకుముందు, ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 1, జాసన్ రాయ్ 12 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 9 పరుగులకే వెనుదిరిగాడు. ఈ ముగ్గురూ దీపక్ చహర్ బౌలింగ్ లో అవుటయ్యారు.
ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఎలాంటి మార్పులేదు.