once in a century: ధోనీ.. శతాబ్దికొక్కడు: సునీల్ గవాస్కర్
- అతడు మరిన్ని సీజన్ల పాటు ఆడాలన్న లెజండరీ బ్యాటర్
- ధోనీని చూడాలని అభిమానులు కోరుకుంటారని వెల్లడి
- అతడు ఆడితే ఐపీఎల్ కు ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయం
లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ కనీసం మరో సీజన్ లేదంటే మరిన్ని సీజన్ల పాటు ఐపీఎల్ కోసం ఆడాలని, దీనివల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ప్రయోజనం పొందుతుందని వ్యాఖ్యానించారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన ధోనీ దశాబ్దానికి ఒక్కసారి వచ్చే క్రికెటర్ కాదని.. శతాబ్దానికి వచ్చే ఒక్క ఆటగాడని అభివర్ణించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన సొంత మైదానం అయిన చెపాక్ స్టేడియంలో లీగ్ దశలో చివరి మ్యాచ్ ను నిన్న ముగించింది. ఈ మ్యాచ్ తర్వాత గవాస్కర్ తన షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
‘‘కెవిన్ పీటర్సన్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి లోగడే చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా అతడు (ధోనీ) ఐపీఎల్ లో ఆడాలి. ధోనీ వంటి క్రీడాకారుడు పదేళ్లకొక్కడు కాదు, నూరేళ్లకు ఒక్కసారే వస్తాడు. కనుక అతడ్ని మళ్లీ మళ్లీ చూడాలని అభిమానులు కోరుకుంటారు. కనుక ఇదే అతడికి చివరి సీజన్ కాబోదు. మళ్లీ మళ్లీ ఆడతాడనే అనుకుంటున్నాను’’ అని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో గావాస్కర్ పేర్కొన్నారు. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ తో ధోనీ మరిన్ని సీజన్ల పాటు ఆడొచ్చని కెవిన్ పీటర్సన్ లోగడ చెప్పడం గమనార్హం. ఈ రూపంలో ధోనీ తన శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ మోకాలికి గాయం ఉంటే చికిత్స తీసుకుని కొన్ని నెలల్లో నయం చేసుకోవచ్చన్నాడు.