LSG: మళ్లీ ఆర్సీబీ, ఎల్ ఎస్ జీ అభిమానుల మధ్య ట్వీట్ల పోరు
- ఎలిమినేటర్ మ్యాచ్ లో పోరాడతాయంటున్న అభిమానులు
- రెండూ ప్లే ఆఫ్ కు చేరుకుంటే పోరు ఖాయమే
- రాజస్థాన్ పై ఆర్సీబీ విజయాన్ని అభినందించిన ఎల్ఎస్ జీ
అసలు కంటే కొసరు ఎక్కువనే సామెత వినే ఉంటారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ ఎస్ జీ) జట్ల అభిమానులు ఇప్పుడు ఈ సామెతనే గుర్తు చేస్తున్నారు. ఇటీవల లక్నోలోని ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ, ఎల్ ఎస్ జీ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా, మ్యాచ్ ముగిసిన తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరగడం చూసే ఉంటారు. లక్నో బౌలర్ నవీనుల్ హక్, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మాటల వైరం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇదే విషయమై లక్నో మెంటార్ గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య కూడా వాగ్వివాదం జరిగడం గుర్తుండే ఉంటుంది.
ఆదివారం రాజస్థాన్ జట్టుపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో అభినందనగా అన్నట్టు లక్నో సూపర్ జెయింట్స్ తన ట్విట్టర్ పేజీలో ఆర్సీబీ అని టైప్ చేసి, సూపర్ అన్న ఎమోజీని జోడించి కళ్ల గుర్తులు వేసింది. దీంతో ఇరు ఫ్రాంచైజీల అభిమానుల మధ్య ట్వీట్ల పోరుకు దారితీసింది. ఈ రెండూ ప్లే ఆఫ్ కు చేరుకుని అక్కడ ఎలిమినేటర్ లో తలపడాలన్న ఆకాంక్ష అభిమానుల నుంచి వ్యక్తమైంది.
లక్నో, బెంగళూరు జట్లు లీగ్ దశలో చెరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి. లక్నో 12 మ్యాచులకు గాను 6 విజయాలు, ఒకటి ఫలితం తేలని మ్యాచ్ రూపంలో 13 పాయింట్లతో బెంగళూరు జట్టు కంటే ఒక మెట్టు పైన ఉంది. బెంగళూరు జట్టు 12 మ్యాచులకు 6 విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
గౌతం గంభీర్ అంతా సవ్యంగానే ఉందా? అంటూ దేశ్ భక్త్ అనే యూజర్ ప్రశ్నించాడు. గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య వైరాన్ని మరోసారి చూడాలనుకుంటున్నట్టు మిస్టర్ పర్ ఫెక్ట్ అనే యూజర్ పేర్కొన్నాడు. ఆర్సీబీ, ఎల్ ఎస్ జీ మధ్యే ఎలిమినేటర్ ఉండొచ్చని బాలు అనే యూజర్ పేర్కొన్నాడు. వీరు కోరుకున్నట్టు రెండూ ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయి ముఖాముఖి తలపడితే అది చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనడంలో సందేహం లేదు.