Kavitha: ఆ బాధ నుంచి బయటపడాలనుకుంటున్నా... సినిమాల్లో మళ్లీ అవకాశం వస్తే నటిస్తా: సీనియర్ నటి కవిత

Actress Kavitha eager to act again

  • కరోనా సంక్షోభం సమయంలో కుమారుడు, భర్తను కోల్పోయిన కవిత
  • మనోవేదనతో ఆత్మహత్య ఆలోచనలు
  • కుమార్తెలను చూసి ఆగిపోయానన్న కవిత
  • సినిమాల్లో మళ్లీ బిజీగా కావాలనుకుంటున్నానని వెల్లడి 

కరోనా సంక్షోభం సమయంలో సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తొలుత కుమారుడు, ఆ తర్వాత భర్తను కోల్పోయిన కవిత మానసికంగా కుంగిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పరిస్థితిని వివరించారు. 

కొడుకు చనిపోయిన 10 రోజులకే భర్త కూడా ఈ లోకాన్ని విడిచిపోవడంతో ఎంతో వేదనకు గురయ్యానని, ఆ బాధ భరించలేక ఆత్మహత్య ఆలోచన చేశానని కవిత తెలిపారు. కానీ, తన కుమార్తెలను చూసి ఆ ఆలోచన విరమించుకున్నానని వెల్లడించారు. 

ఆ బాధ తనలో ఇంకా తొలగిపోలేదని, మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆ బాధ నుంచి బయటపడడం కోసం మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తున్నానని కవిత వెల్లడించారు. అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. 

కాగా, భర్త బతికున్న రోజుల్లో తాను మహారాణిలా వెలిగానని కవిత గుర్తుచేసుకున్నారు. పలు కారణాల వల్ల సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నానని, అప్పటికి తన వయసు 20 ఏళ్లేనని వివరించారు. అప్పటికే అంగీకరించిన సినిమాలు తప్ప పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యానని తెలిపారు.

తన భర్తకు 11 దేశాల్లో పెట్రోలియం వ్యాపారం ఉండేదని, ఏడేళ్ల కిందట వ్యాపారంలో దెబ్బతినడంతో రూ.132 కోట్ల నష్టం వచ్చిందని కవిత వెల్లడించారు. ఆ సమయంలో తమ కుటుంబం కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని, తీవ్ర మనో వేదనతో తన భర్త కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నారని వివరించారు. 

టీనేజ్ వయసులోనే సినిమాల్లోకి వచ్చిన కవిత హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు. పెళ్లి తర్వాత చాన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, పిల్లలు పెద్దవాళ్లయ్యాక మళ్లీ కెమెరా ముందుకు వచ్చి క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఇప్పుడు మానసిక ప్రశాంతత కోసం మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు. 

కవిత రాజకీయాల్లోనూ ప్రవేశించారు. టీడీపీలో చేరడం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత కాలంలో బీజేపీ వైపు మళ్లారు.

  • Loading...

More Telugu News